మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత: పల్లా వెంకటరెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై దేశ ప్రజానీకం తీవ్ర వ్యతిరేకతతో ఉందని, ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి (Palla Venkat Reddy) ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జన చైతన్య పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత మోదీ సర్కార్ విధానాలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. రైతు ఉద్యమం దెబ్బకు మూడు రైతు చట్టాలు వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు.

ఢిల్లీలో విద్యార్థులు నిర్వహించిన జెన్ జీ ఉద్యమంతో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ ప్రజల విజయమని తెలిపారు. 2024లో ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఒకప్పుడు మోదీని కమ్యూనిస్టుల కంటే ఎక్కువ తిట్టారన్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే వారిద్దరూ మోదీతో జతకట్టడం ప్రజాసామ్య వ్యవస్థను ఖూనీ చేసిందని ఆరోపించారు.

ఉత్తరాది రాష్ట్రాలకే నిధులు..

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కపట ప్రేమ ప్రదర్శిస్తూ నిధులను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లిస్తోందని పల్లా వెంకట్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని ఎన్నికల ముందు ప్రకటించారని, ఇప్పుడు న్యాయ సమస్యలు ఉన్నాయంటూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిరసనలు ప్రజాస్వామ్య హక్కు అని చెబుతుంటే, బీజేపీ మాత్రం విద్యార్థులపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 14 వరకు జన చైతన్య పాదయాత్రలు నిర్వహించామన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగే మహా ర్యాలీ, బహిరంగ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..

రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సీపీఐ బలమైన పోరాటాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తుందన్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అధికార ప్రతిపక్ష నాయకులు పరస్పర నిందలు చేసుకుంటూ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీ జిల్లా కార్యదర్శి బాలకిషన్, మాజీ జిల్లా కార్యదర్శి పరమేశ్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్, రాము, కృష్ణ యాదవ్, గోవర్ధన్, అల్వాల్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు శంకర్ నాయక్, భాష, మహేష్, సత్యనారాయణ రెడ్డి,భార్గవి, ఆంజనేయులు, ఇందిరా, సువర్ణ, జంగయ్య, దేవానంద్, ఏఐఎస్ఎఫ్ జిజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, శ్రీను, లక్ష్మణ్, కోటకథ నరసింహ, గంటల శీను, అంజమ్మ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>