కలం, ఖమ్మం బ్యూరో: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక అడుగు వేశారు. ఖమ్మం జిల్లా దాహార్తిని తీర్చే ప్రధాన ఆధారమైన పాలేరు జలాశయానికి (Paleru Reservoir) నాగార్జున సాగర్ జలాలు చేరుకోవడంతో రిజర్వాయర్‌కు మళ్లీ ‘సాగర’కళ సంతరించుకుంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామ గ్రామానికి తాగునీటి కొరత లేకుండా చూసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ వివరాలను ఐబీ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) మంగళపూడి వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు.
ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం 15.90 అడుగులకు పడిపోవడంతో, తాగునీటి అవసరాలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టామని SE తెలిపారు.రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టమైన 23 అడుగుల వరకు నింపడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, దేవులపల్లి మీదుగా ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీరు పాలేరుకు చేరుతోందని వివరించారు. వర్షాలు లేకపోవడంతో ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే కేటాయించామని ఆయన స్పష్టం చేశారు. నీటి తరలింపులో ఎలాంటి వృథా జరగకుండా కాలువల గేట్ల లీకేజీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SE వెంకటేశ్వర్లుతో పాటు ఐబీ విభాగానికి చెందిన ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

