Mobile Popup Ad
Mobile Popup Ad

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ సేకరణపై కీలక సమీక్ష

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి (Palamuru Rangareddy) ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్వాసితుల సమస్యపై భూ సేకరణ పునరావాసం, పునర్నిర్మాణం (R&R) కమిషనర్ కె. శివకుమార్ నాయుడు సమీక్ష చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదండాపూర్, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, రాజీవ్ భీమా ప్రాజెక్టులపై కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రగతి, ప్రతిపాదిత లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అనుసంధాన టన్నెల్ భూసేకరణపై ఆరా తీశారు. ఈ ప్రాజెక్టుతో ఉదండాపూర్, వల్లూర్, రేగడిపట్టి, చిన్నగుట్ట, తుమ్మలకుంట, శ్యామగడ్డ, ఒంటిగుడిసె, పోలేపల్లి తండాలు ముంపునకు గురవుతున్నట్లు రెవెన్యూ అధికారులు నివేదించారు. 1,890 మంది నిర్వాసితుల ఖాతాల్లో నిధులు జమ చేశామని, మిగిలిన వారికి త్వరలో పరిహారం అందచేస్తామన్నారు.

ఉదండపూర్ నిర్వాసితులకు త్వరలోనే ప్లాట్లు..

ఉదండపూర్ ముంపు బాధితులకు కేటాయించిన 280 ఎకరాల పునరావాసం లే అవుట్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ పనులను త్వరగా పూర్తి చేసి బాధితులకు ప్లాట్లు అప్పగించాలని కమిషనర్ కె. శివకుమార్ నాయుడు సూచించారు. పునరావాస కేంద్రం సరిహద్దు వివాదాలు ఉన్న చోట పరిష్కారానికి జడ్చర్ల తహసీల్దార్, ల్యాండ్ సర్వే ఏడీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల కోసం ప్రభుత్వం వారం రోజుల్లో రూ. 3 కోట్లు విడుదల చేస్తామన్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, ఆర్‌అండ్‌బీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, పునరావాస కేంద్రంలో గుడుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

త్వరగా కోర్ట్ కేసుల పరిష్కారం..

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు భూ సేకరణ సమస్యల గురించి కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డిని ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం భూసేకరణకు సంబంధించి అవసరమైన 105 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 90.5 ఎకరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. రాజీవ్ భీమా ప్రాజెక్టు సంబంధించి కేవలం ఒక ఎకరం లోపు భూమి మాత్రమే సేకరించాల్సి ఉందని, ఎలాంటి పెండింగ్ సమస్యలు లేవని అధికారులు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులను భూసేకరణ చట్టం ప్రకారం త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాం రెడ్డి, ఆర్డీవో నవీన్, భూ సర్వే రికార్డుల శాఖ ఏడీ అశోక్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్, మిషన్ భగీరథ, జడ్చర్ల తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>