కలం, వెబ్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 3-0 తేడాతో ఐస్‌లాండ్‌ను ఓడించింది. గాయం తర్వాత మైదానంలోకి వచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Messi) అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ ప్రారంభంలో ఐస్‌లాండ్ గోల్ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఆ వెంటనే పుంజుకున్న అర్జెంటీనా తరఫున ఎనిమిదో నిమిషంలో వాలెంటిన్ బార్కో మొదటి గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో మొదటి హాఫ్ ముగిసే సమయానికి అర్జెంటీనా 1-0తో ముందంజలో నిలిచింది. రెండో హాఫ్‌లో అర్జెంటీనా కోచ్ జట్టులోకి ముగ్గురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను తెచ్చారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే స్టార్ ప్లేయర్ మెస్సి కూడా మైదానంలోకి అడుగుపెట్టాడు. వచ్చిన వెంటనే మెస్సి ఇచ్చిన పాస్‌తో లౌటారో మార్టినెజ్ పెనాల్టీని సాధించాడు. 72వ నిమిషంలో ఈ పెనాల్టీని మెస్సి గోల్‌గా మార్చి అర్జెంటీనా ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇది అతనికి 117వ అంతర్జాతీయ గోల్. చివరిగా 86వ నిమిషంలో థియాగో అల్మాడా మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. ఈ గెలుపుతో అర్జెంటీనా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. జూన్ 16న అల్జీరియాతో జరిగే మ్యాచ్‌తో అర్జెంటీనా తన టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించనుంది.

