కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఏడాదిలోగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy), జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి , వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ,నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచికుల రాజేశ్వర్ రెడ్డి, పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులతో కలిసి ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు కోసం జీవో ఇచ్చినా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డిపిఆర్)ను కేంద్ర జల సంఘానికి ఇవ్వడానికి ఏడు సంవత్సరాలు తీసుకుని 2022లో సమర్పించిందని.. ఇదేనా వారి చిత్తశుద్ధి అంటూ ప్రశ్నించారు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక పంప్ హౌస్ ఆన్ చేసినా ఒక్క ఎకరానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇదేనా 90 శాతం పనులు పూర్తి చేయడం అంటే అంటూ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండున్నరేళ్లలో అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తూ అన్ని చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పి, భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. డిసెంబర్ 2027 లక్ష్యంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి నిరంతరం రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారని, ఈ విషయం మరిచిన బీఆర్ఎస్ నేతలు అవాకులు చివాకులు పేలుతున్నారని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ నాయకులు ఉనికి కోసం పాదయాత్రలు చేస్తూ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని పేర్కొన్నారు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ మాటలను పాలమూరు ప్రజలు ఎన్నటికీ నమ్మరని.. అందుకే ఇటీవలి జరిగిన అన్ని ఎన్నికల్లో గుణపాఠం చెబుతూనే ఉన్నారని చెప్పారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మూడు పునాదులపై ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి చెందుతోందని వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని గుర్తు చేశారు. ”ప్రాజెక్టులు పూర్తవుతాయి.. పాలమూరు సస్యశ్యామలం అవుతుంది” , ఇందులో ఎవరికి ఎలాంటి సంశయం అక్కర్లేదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల కల్లబొల్లి మాటలు వారికి ఏనాడూ లాభం చేకూర్చవని, బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.
పంచాయతీ సీన్ మున్సిపాలిటీలోనూ రిపీట్..
రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రజలు తగిన తీర్పుతో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఆయన హితవు పలికారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ (UMPPS JAC) రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి లేఖ రాసిందని తెలిపారు. జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే డిండి లిఫ్ట్‌ను రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసిందని, ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ గొట్టిముక్కుల లిఫ్ట్ స్కీమ్ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు స్పష్టం చేశారు. 8-8-2013న విడుదల చేసిన జీవో 72ను వెంటనే అమలు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

