కలం, వెబ్ డెస్క్ : గతంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రదర్శించిన అణు హెచ్చరికలు కేవలం అబద్ధపు బెదిరింపులేనని ఇండియా నిరూపించిందని వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ (Vice Admiral AN Pramod) అన్నారు. పాకిస్థాన్ పదేపదే ప్రయోగించే న్యూక్లియర్ బ్లఫ్ ను ఇండియా నౌకాదళం ఆ సమయంలో సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆయన వెల్లడించారు. రక్షణ రంగానికి సంబంధించిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను గుర్తుచేసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ తన అణ్వాయుధ సంపత్తిని చూపి భారత్‌ను మానసికంగా ఒత్తిడికి గురిచేయాలని ప్రయత్నించిందన్నారు. అయితే.. భారత నావికాదళం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన వ్యూహాలను అమలు చేసిందని వివరించారు. భారత దళాల దూకుడు ముందు పాక్ అణు హెచ్చరికలు పని చేయలేదని, దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో పాక్ బలహీనత బయటపడిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందని, శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి అసంబద్ధ బెదిరింపులనైనా ఎదుర్కొనే సత్తా ఇండియన్ ఆర్మీకి ఉందని వైస్ అడ్మిరల్ ప్రమోద్ స్పష్టం చేశారు.

