కలం, వెబ్ డెస్క్: భారత్ (India) చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బ తిన్నా వక్రబుద్ధి మార్చుకోని పాకిస్థాన్.. మరోసారి దాడికి సిద్ధమైనట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు. ఇందుకోసం 9 మందితో కూడిన ముఠాను ఐఎస్ఐ తయారు చేసింది. ఇటీవలే దిల్లీ స్పెషల్ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో వీరిని అరెస్ట్ చేయగా.. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరికి పాక్ ఐఎస్ఐకి చెందిన షహజాద్ భట్టితో చాలా దగ్గరి సంబంధాలున్నాయని.. ఎక్కడెక్కడ దాడులు చేయాలో కూడా స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. వీరి నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆలయంలో కాల్పులు.. దాబాలపై గ్రెనేడ్ దాడులు..
మొదట వీరు దేశ రాజధాని దిల్లీలో దాడి చేయాలని కుట్ర చేశారు. ఇందు కోసం, అత్యంత రద్దీగా ఉండే ఆలయాన్ని ఎంచుకుని అక్కడ కాపాలాగా ఉన్న పోలీసులు, పారామిలటరీ సిబ్బందిపై విచక్షణరహితంగా కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు, దిల్లీ–సోనిపట్ హైవేపై ఉన్న అత్యంత రద్దీగా ఉండి, రోజుకు వందల మంది వచ్చి వెళ్తుండే ఒక దాబాను లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడ భోజనం చేస్తున్నవారిపై గ్రెనేడ్లపై దాడులు చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన మ్యాప్‌లను సేకరించి.. పాకిస్థాన్‌లోని కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కూడా పంపించినట్లు గుర్తించారు.
పోలీస్ స్టేషన్లు, మిలటరీ క్యాంపుపై..
మరో ప్రణాళికలో ఉగ్రవాదులు యూపీని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ప్రధాన పోలీస్ స్టేషన్లపై నేరుగా బాంబులు విసురాలని ఫిక్సయ్యారు. అంతేగాకుండా, హరియాణాలోని హిస్సార్‌లో ఉన్న మిలటరీ క్యాంపును సైతం గురి పెట్టారు. అక్కడ కూడా భారీ దాడి జరిపేలా కొన్ని వీడియోలు రూపొందించుకుని పాకిస్థాన్ పంపించినట్లు విచారణలో తేలింది. ఈ ముఠాలో గ్వాలియర్‌కు చెందిన 19 ఏళ్ల వివేక్ బంజారా, 21 ఏళ్ల రాజ్ వీర్ కూడా ఉండటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వీరు ఐఎస్ఐ అనుబంధ గ్రూపులతో టచ్‌లోకి వెళ్లి.. సొంత దేశంపైనే దాడులకు తెగబడాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ పోలీసులు.. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు.

