కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan), సౌదీ అరేబియా, తుర్కియే మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పేరుతో మూడు దేశాల అధినేతలు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు. శుక్రవారం సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన సమావేశంలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది మూడు దేశాలపైనా జరిగిన దాడిగానే పరిగణించనున్నారు. ఈ ఒప్పందంలో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడం, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, రక్షణ సాంకేతికతను పరస్పరం పంచుకోవడం, నిఘా సమాచార మార్పిడి వంటి అంశాలు ఉన్నాయి. ఈ ఒప్పందంపై ఇరాన్ స్పందించింది. రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల శాశ్వత భద్రత లభించదని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఇబ్రహీం రెజాయి వ్యాఖ్యానించారు.

