కలం, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం పొదుపు చర్యలకు దిగింది. కొత్త వాహనాల కొనుగోళ్లపై నిషేధం, పెళ్లిళ్లలో ఒకే వంటకం (సింగిల్ డిష్) నిబంధన, విదేశీ పర్యటనలపై నిషేధం, రాత్రి 9 గంటలకే మార్కెట్ల మూసివేత లాంటి కోవిడ్ తరహాలో కఠిన నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. రెడ్ సీ మార్గంలో ఏర్పడిన అంతరాయాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు చేపట్టింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ వాహనాల కొనుగోలుపై పూర్తి నిషేధం విధించింది. అధికారుల అధికారిక వాహనాలకు కేటాయించే ఇంధన కోటాను 50 శాతానికి కుదించారు. అలాగే వివాహ వేడుకలలో కేవలం ఒకే వంటకాన్ని వడ్డించేలా నియమం తెచ్చారు. ఈ అలాగే ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల విదేశీ ప్రయాణాలపై మూడు నెలల పాటు ఆంక్షలు విధించారు.
ఇక పాకిస్తాన్ కేబినెట్ డివిజన్ జారీ చేసిన ఈ తాజా నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంధన కోతలు, ఫెడరల్ అధికారులపై విదేశీ ప్రయాణాల నిషేధం లాంటి కొన్ని కీలక నిబంధనలు కనీసం మూడు నెలల పాటు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న ఆర్ధిక సవాళ్లు, ఇంధన కొరతను అధిగమించడానికి ప్రభుత్వం ఈ కఠిన చర్యల వైపు మొగ్గు చూపింది.

