కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా (Karimnagar) తిమ్మాపూర్ మండల పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డిప్లొమా విద్యార్థిని శ్రీ విద్య దుర్మరణం చెందిన ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు… విద్యా సంస్థల చుట్టూ విస్తరిస్తున్న ‘అనధికార నైట్ కల్చర్’ తెచ్చిపెట్టిన పెను విషాదం! అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా యథేచ్ఛగా సాగుతున్న వ్యాపారాలు, పోలీస్ పెట్రోలింగ్ లోపాలు, విద్యార్థులను ఆకర్షిస్తున్న నైట్ లైఫ్ ప్రలోభాలపై ఈ సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ప్రమాదం జరిగిందిలా..
సిరిసిల్లకు చెందిన మహేందర్ కుమార్తె శ్రీ విద్య, కళాశాల సమీపంలోని “ఎస్ఆర్ రెడ్డి” ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. బుధవారం అనారోగ్యం కారణంగా కళాశాలకు వెళ్లని శ్రీ విద్య, రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తన స్నేహితురాలు భావనతో పాటు మరో ఇద్దరితో కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చింది. రాత్రి 11:40 గంటల సమయంలో బేకరీ కోసం వీరంతా మహాత్మానగర్ వద్ద రహదారి దాటుతుండగా, కరీంనగర్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వీరిని తీవ్రంగా ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో శ్రీ విద్య తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకుంది. ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భావన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మిగతా ఇద్దరు విద్యార్థినులు తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు.
అర్ధరాత్రి దాటినా వెలుగుతున్న బోర్డులు..
సుభాష్ నగర్ చౌరస్తా నుండి మహాత్మా నగర్ తపాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంతం వరకు, అలాగే ఎల్ఎమ్డి డ్యామ్ కట్ట పరిసరాల్లో అర్ధరాత్రి 12 గంటలు దాటినా హోటళ్లు, బేకరీలు, చాయ్ పాయింట్లు తెరిచే ఉంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవార్లూ నడిచే ఈ వ్యాపార సముదాయాలే విద్యార్థులు రాత్రివేళల్లో రోడ్లపైకి రావడానికి ప్రధాన కారణమవుతున్నాయి. హాస్టల్ గోడలు దూకి అయినా సరే బయటకు వచ్చేలా ఈ కేంద్రాలు యువతను ఆకర్షిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణ కరువైన “స్టూడెంట్ జోన్లు”..
జ్యోతిష్మతి వంటి పెద్ద కళాశాలలు ఉన్న ఈ ప్రాంతం ఒక రకంగా “ఎడ్యుకేషనల్ హబ్”. వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు ఉండే ఈ పరిసరాల్లో రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్ ఉండాలి. కానీ, సుభాష్ నగర్ చౌరస్తా పరిసరాల్లో రాత్రివేళల్లో విద్యార్థులు గుంపులుగా సంచరిస్తున్నా, బైక్ రైడింగ్లు చేస్తున్నా పోలీసులు కనీస దృష్టి సారించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతుల్లేని హాస్టళ్లు… పర్యవేక్షణ లేని వార్డెన్లు..
విద్యార్థుల భద్రతను గాలికి వదిలేసి, కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా వెలుస్తున్న ప్రైవేట్ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ సున్నా. 17 ఏళ్ల మైనర్ విద్యార్థినులు అర్ధరాత్రి 11:30 గంటలకు బయటకు వెళ్తున్నా హాస్టల్ యాజమాన్యానికి తెలియకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఎలాంటి అనుమతులు, నాణ్యతా ప్రమాణాలు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ హాస్టళ్లలో భద్రత శూన్యంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.
స్పందించాల్సిన సమయం ఇది..
*విద్యాసంస్థల సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత నడిచే బేకరీలు, హోటళ్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలి.
*డ్యామ్ కట్ట పరిసరాల్లో, ప్రధాన రహదారులపై రాత్రి 10 గంటల తర్వాత పోలీసు గస్తీని పెంచాలి.
*మండల పరిధిలోని ప్రైవేట్ హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలు, రిజిస్టర్ నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరుపై టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి.
ఒక విద్యార్థిని ప్రాణం పోయాక కంటితుడుపు చర్యలు చేపట్టడం కాకుండా, ఇకనైనా యంత్రాంగం నిద్రలేచి రాత్రివేళల్లో సాగుతున్న ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

