కలం, నల్లగొండ : ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Collector Chandrasekhar) అన్నారు. మంగళవారం ఆయన పీఏపల్లి మండలం అంగడిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, తరలింపు ప్రక్రియపై సెంటర్ నిర్వాహకులతో మాట్లాడుతూ ఇంకా ఎంత ధాన్యం మిగిలి ఉందని ఆరా తీశారు. ధాన్యం తరలింపులో ఎందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్ ప్రశ్నించారు. రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేసేందుకు అవసరమైన లారీలు, హమాలీల లాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

