కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతోపాటు జిల్లాలోని అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఖమ్మం ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ (DISHA Committee) రామసహాయం రఘురాం రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశా కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. అభివృద్ధి పనుల పురోగతిని సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ ఎంపీ పి. బలరాం నాయక్, కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రులకు అవసరమైన సీటీ స్కాన్ లాంటి పరికరాల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దీనికోసం ప్రజాప్రతినిధులు సీఎస్ఆర్ నిధులను సమీకరించాలని సూచించారు. గుండాల ఘటనపై డీఎంహెచ్‌ఓ 48 గంటల్లో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యం తగదన్నారు.
అటవీ అధికారుల ఆధిపత్యానికి స్వస్తి పలకాలి: కూనంనేని
కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లకు నంబర్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అటవీ అధికారుల చర్యలు సరికాదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నిలిచిపోయిన పోడు భూముల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని అటవీ శాఖను కోరారు. వైద్య విధాన పరిషత్, డీఎంహెచ్‌ఓ, డీఎంఈ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల నిరుపేద రోగులకు సరైన వైద్యం అందడం లేదని, ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, సాంకేతిక (యాప్) కారణాలతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను మంజూరు చేయాలన్నారు. ఈ వ్యవహారంలో దిశా కమిటీ ద్వారా ప్రభుత్వానికి తీర్మానం పంపించారు. అలాగే గత రెండున్నరేళ్ల డీఎంఎఫ్‌టీ నిధుల వివరాలను వెల్లడించాలని, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖల సమన్వయంతో తాగునీటి పైప్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తాగునీటి సౌకర్యం కల్పించాలి: ఎంపీ బలరాం నాయక్
జిల్లాలోని 124 గిరిజన ఆవాసాలకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లకు వెంటనే తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని ఎంపీ బలరాం నాయక్ స్పష్టం చేశారు. అటవీ అనుమతుల కారణంగా విద్యుత్ లైన్లు, రహదారులు, పోడు రైతుల సమస్యలు నిలిచిపోకుండా. డీఎఫ్‌ఓలు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని త్వరగా పరిష్కరించాలన్నారు. అమృత్ పథకం కింద తొవ్విన రహదారులను వెంటనే పునరుద్ధరించాలన్నారు. పీఎంఏవై, ఉపాధి హామీ పెండింగ్ చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులను వేగవంతం చేస్తూనే, స్టేషన్ పేరును ‘భద్రాచలం రోడ్’ నుంచి ‘కొత్తగూడెం’గా మార్చే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశానికి ముందు ఇటీవల మరణించిన అటవీ శాఖ బీటీఓ బానోత్ నవీన్‌కు దిశా కమిటీ సభ్యులు నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

