కలం, నల్లగొండ: పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, తాగునీరు, విద్యుత్, పార్కులు వంటి అన్ని మౌలిక వసతులను కల్పించి.. నల్గొండను (Nalgonda) తెలంగాణలోనే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో రూ.23.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, భూమిపూజలు చేశారు. 3వ డివిజన్‌లో ఎస్టీ కాలనీ నుంచి శేషమ్మగూడెం మీదుగా అద్దంకి రహదారి వరకు నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పానగల్ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి డీఈఓ కార్యాలయం వరకు మూడు కిలోమీటర్ల మేర ‘వన్ టైమ్ ఇంప్రూవ్‌మెంట్’ కింద చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.
నల్గొండ పట్టణం చుట్టూ రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు, పట్టణంలో రూ.500 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పట్టణ అభివృద్ధితో పాటు పర్యాటక రంగానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. లతీఫ్ సాబ్ గుట్ట, శివాలయం గుట్టల అభివృద్ధికి రూ.150 కోట్లు, రోప్‌వే ఏర్పాటుతో పాటు ఛాయా సోమేశ్వర దేవాలయ పర్యాటక అభివృద్ధికి మరో రూ.150 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు మొదటి విడతలో 700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, గొల్లగూడ సమీపంలో నిర్మించిన 552 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు అందించినట్లు మంత్రి తెలిపారు.
విద్యారంగ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్‌జీ కళాశాలను ‘ప్రతీక్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మోడల్ కాలేజీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ.3 కోట్లతో పెట్రోల్ పంప్, రూ.2 కోట్లతో సూపర్ మార్కెట్ పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. గోదాములు, రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మున్సిపల్ కమిషనర్ వంశీ, ఆర్‌అండ్‌బీ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

