epaper
Sunday, March 1, 2026
epaper

ఆపరేషన్ కగార్ : మరో బిగ్గెస్ట్ టాస్క్ పై పోలీస్ ఫోకస్

కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆపరేషన్ కగార్ (Operation Kagar) తో మావోయిస్టుల్లో కొందరు చనిపోతున్నారు.. ఇంకొందరు లొంగిపోతున్నారు.. దీంతో లీడర్లు, కేడర్ లేని వ్యవస్థగా మావోయిస్టు పార్టీ మిగిలిపోయింది. చివరకు రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు కనుమరుగైంది. ఇక మిగిలింది వారి ఆయుధాలు, డంప్‌లు, ఆల్రెడీ భూమిలో పాతిపెట్టిన మైన్స్. ఇప్పుడు వీటిని వెలికితీయడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చుకునే పని మొదలైంది. ఆపరేషన్ కగార్ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ మార్చి 31తో ముగియనున్నది. ఆ తర్వాత రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వెపన్స్, మైన్స్ కోసం వేటు మొదలుకానున్నది. మావోయిస్టు ఉద్యమం ఉనికే ప్రశ్నార్థకం కావడంతో ప్రజా ప్రతినిధులు ఇకపై మారుమూల గ్రామాలకు సైతం వెళ్ళేందుకు స్వేచ్ఛ లభించినట్లయింది.

పేలుడు పదార్ధాల వెలికితీత ప్రోగ్రామ్ :

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను భౌతికంగా ఏరివేసే కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంటుండగానే అక్కడి మారుమూల గ్రామాల్లోకి బుల్డోజర్లు ఎంటర్ అయ్యాయి. మావోయిస్టు పార్టీ అప్పట్లో నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాలను ధ్వంసం చేసే కార్యక్రమం ఊపందుకున్నది. అదే సమయంలో గతంలోనే భూమిలో పాతిపెట్టిన ఆయుధాల డంప్‌లు, మందుపాతరలు, క్లేమోర్ మైన్స్, డిటొనేటర్లు, పేలుడు పదార్ధాల నిల్వలు.. వీటన్నింటినీ వెలికితీసే చర్యలు మొదలయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో సైతం ఇదే కార్యక్రమం అమలుకానున్నది. ఇందుకోసం టెక్నాలజీని రాష్ట్ర పోలీసులు వినియోగించాలి అనుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రక్రియ రెండు నెలల తర్వాత ప్రారంభమయ్యే అవకాశమున్నది.

గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ఎక్విప్‌మెంట్ :

సాధారణంగా వీఐపీ టూర్ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌ విభాగానికి చెందిన పోలీసులు ప్రత్యేక ఎక్విప్‌మెంట్‌తో గాలించడం ఆనవాయితీ. ఇప్పుడు మరింత అడ్వాన్స్ టెక్నాలజీని వినియోగించి నిర్దిష్ట టైమ్‌లోగా ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది పోలీసు విభాగం. దాంట్లో భాగంగానే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్‌ పరికరాలను సమకూర్చుకోనున్నది. భూమి లోపల పాతి పెట్టిన మెటల్, నాన్-మెటల్ పదార్ధాలతో పాటు ఎలక్ట్రిక్ వైర్లు, డిటొనేటర్లు, పేలుడు పదార్ధాలను సైతం కనిపెట్టేందుకు వేర్వేరు పరికరాలను వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. నిర్దిష్ట ప్రాంతంలో భూమి లోపల నాలుగు అడుగుల లోతు వరకు ప్రెషర్ ప్లేట్ వైర్లు, ప్రెషర్ కుకర్ బాంబులు, గ్యాస్ సిలిండర్లు, టిఫిన్ బాక్సులు, స్టీల్ కంటెయినర్ బాక్సులు, ఇనుప పైపులు, ఐఈడీ (IED) పేలుడు పదార్ధాలు.. ఇలాంటి అన్నింటినీ ఆ పరికరాలు కనిపెట్టేలా పోలీసులు ఆలోచిస్తున్నారు.

అవశేషాలూ లేకుండా పకడ్బందీ చర్యలు :

మావోయిస్టు పార్టీ అవశేషాలే లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నది రాష్ట్ర పోలీసుల లక్ష్యం. ఈ పరికరాలను సమకూర్చుకోడానికి ముందే అవి ఎలా పనిచేస్తాయో ప్రాక్టికల్‌గా పోలీసులు స్పెషల్ డిమాన్‌స్ట్రేషన్ ద్వారా పరీక్షించనున్నారు. భూమిలో కేవలం లోహంతో కూడినవే కాకుండా ఇతర పేలుడు పదార్ధాలు ఉన్నా ఈ ఎక్విప్‌మెంట్ ద్వారా సౌండ్ రూపంలో అలర్ట్ రావడంతో పాటు ఆ పరికరానికి అమర్చిన డిజిటల్ డిస్‌ప్లే ద్వారా అనుమానిత వస్తువుకు సంబంధించిన వివరాలు అందేలా పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా పోలీసులే వారి ఆవరణలో ఇలాంటి కొన్ని వస్తువులను పెట్టి ఆ పరికరం ద్వారా కనిపెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరికరం సంతృప్తికరంగా పనిచేస్తూ పోలీసులకు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఇక మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన అన్ని డంప్‌లనూ వెలికితీయడానికి వీలవుతుంది. నాలుగు నెలల్లో ఈ పరికరాలు సమకూరే అవకాశమున్నది.

Read Also : భర్త సీఎం.. భార్య ఎమ్మెల్యే.. అసెంబ్లీలో ప్రశ్నలు..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!