ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలిచే పంట ఇదే: మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: ఆయిల్ పామ్ సాగుతో (Oil Palm Cultivation) తెలంగాణ రైతాంగానికి మహర్దశ పట్టిందని మంత్రి తుమ్మల అన్నారు. ఒకప్పుడు సాధారణ జీవితాన్ని గడిపిన రైతులు నేడు ఆర్థికంగా నిలదొక్కుకుని తమ పిల్లలను ఉన్నతంగా చదివిస్తూ, ఇళ్ల ముందు కార్లు నిలుపుకునే స్థాయికి ఎదిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల చొప్పున మొత్తం 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

​ఖమ్మం (Khammam) జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ అగ్రోవెట్ సంస్థ రూ. 300 కోట్ల అంచనాతో అత్యంత ఆధునికంగా నిర్మించిన, దేశంలోనే తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌ను, అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీడ్ గార్డెన్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభించారు.

​ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి తుమ్మల (Minister Thummala) మాట్లాడుతూ.. నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఆయిల్ పామ్ సాగు, నేడు రైతులకు కొంగుబంగారంగా మారిందన్నారు. ఎల్ నినో వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా తట్టుకుని రైతులకు నిలకడైన ఆదాయాన్ని ఇచ్చే ఏకైక పంట ఆయిల్ పామ్ అని కొనియాడారు. తోటల్లో అదనపు ఆదాయం కోసం వక్క, జాజికాయ, కోకో వంటి అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు మరింత ప్రయోజనం పొందవచ్చని సూచించారు.

​ప్రస్తుతం దేశంలో ఏటా రూ. 75 లక్షల కోట్ల విలువైన పామాయిల్ దిగుమతులు జరుగుతున్నాయని, విదేశాలపై ఆధారపడటం తగ్గించాలంటే దేశీయంగా ఉత్పత్తి పెరగాలన్నారు. ఇందులో భాగంగానే గోద్రేజ్ సంస్థ విదేశాలపై ఆధారపడకుండా స్వదేశంలోనే నాణ్యమైన విత్తనాలు తయారు చేసేందుకు అంజనాపురంలో దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.

​దేశీయ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పామాయిల్ దిగుమతి సుంకాన్ని (ఇంపోర్ట్ టాక్స్) 44 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఈ విషయమై త్వరలోనే దక్షిణ భారత దేశ వ్యవసాయ మంత్రులందరినీ ఏకం చేసి ప్రధానిని కలవనున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి పాలనలోనే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేస్తామని, రైతులకు అండగా నిలిచే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు.

Read Also: తిట్లు, ఓట్లు రేవంత్‌రెడ్డికి తెలిసింది ఇదే.. కేటీఆర్ ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>