కలం, వనపర్తి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ (JNV Vattem Nagarkurnool) ఆవరణలో నవోదయ విద్యాలయ సమితి 35వ ప్రాంతీయ స్థాయి ఖో-ఖో సమ్మేళనం జూలై 22 నుండి 24 వరకు జరగనున్నాయి. ఈ మూడు రోజుల క్రీడా పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన నిజామాబాద్, అనంతపురం, విజయనగరం, మాహే, మాండ్యా, హవేరి, కలబుర్గి జేఎన్వీ క్లస్టర్లకు చెందిన 550 బాలురు, బాలికలు పాల్గొంటున్నారు.
ఇందులో బాలురు, బాలికల అండర్-14, అండర్-17, అండర్ 19 విభాగాల్లో పోటీలు జరుగన్నాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను జాతీయ స్థాయి సమ్మేళనానికి ఎంపిక చేస్తారు. జూలై 22 బుధవారం ప్రారంభోత్సవంతో సమ్మేళనం ప్రారంభం కానున్నట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జి. పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. జూలై 24 శుక్రవారం ముగింపు వేడుకతో సమ్మేళనం ముగుస్తుందని ఆమె తెలిపారు. ఈ పోటీలు వైస్ ప్రిన్సిపాల్ సుధావాణి, వ్యాయామ శిక్షకులు ఎం.రాధ, పి. విజయ్ కుమార్ ల నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది అన్నారు.

