కలం, వెబ్ డెస్క్: నీట్ (NEET) పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 21న జరగనున్న నీట్ పరీక్షకు ముందు నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు, పోలీసు విభాగాలు, ప్రత్యేక ఎస్కార్ట్ బృందాలు ప్రశ్నాపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రి రవాణాలో పాల్గొంటాయని ఎన్‌టీఏ పేర్కొంది. ఈ మాక్ డ్రిల్ శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగనుంది.
జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ జరుగనుంది. భారత్‌లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో కలిపి 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయం కల్పించారు. 5:15 కు పరీక్ష సమయం ముగిసినా దివ్యాంగులు 6:20 గంటల వరకు పరీక్ష రాయవచ్చు. పరీక్ష నిర్వహణ కోసం 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, 6669 మంది పరిశీలకులను నియమించారు. కేంద్రాల వద్ద సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు కూడా విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం రెండు లక్షల మందికి పైగా పోలీసు, జిల్లాల పరిపాలన సిబ్బంది పరీక్ష నిర్వహణలో పాల్గొంటారని ఎన్‌టీఏ వెల్లడించింది.

