కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ పేరిట విద్యార్థులను మోసం చేశారని ఆరోపిస్తూ, డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో నగిరి (Nagari) టౌన్హాల్లో యువజన విభాగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా (Roja) పాల్గొన్నారు. యువతను ఉద్దేశించి ప్రసంగించి యువతలో జోష్ నింపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చేలా చీకటి జీవోలు తీసుకొచ్చారని ఆరోపించారు. అందుకే మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతి, వసతి దీవెన వంటి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అవి అందే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత తరఫున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించి, అనర్హులకు ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని జీవోల ద్వారా పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండానే స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పేరుతో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉద్యోగాలు కోల్పోయిన అర్హులైన అభ్యర్థుల తరఫున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.
నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ దెబ్బతిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాలు అందించే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక అనేక మంది విద్యార్థులు తమ ఉన్నత విద్య కలలను వదిలేసి కూలీ పనులకు వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారని డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు జరిగితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి పూర్తి స్థాయిలో ముగింపు పలకాలంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో రాజీనామా చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రాహుల్ రాజారెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి కాయం గాంధీ, ఎస్ఐఆర్ రాష్ట్ర పరిశీలకులు వజ్రభాస్కర్ రెడ్డి, నియోకవర్గ యువత అధ్యక్షులు యువరాజ్, మండల యువత అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

