కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 11:30 గంటలకు లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. ఈ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం భారీ లబ్ధి చేకూర్చనుంది.
పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి ఈ రోజు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మొత్తం రూ.3,125 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలో నేరుగా రూ.7 వేల చొప్పున నగదు జమ కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతు కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

