కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల ఖాతాల్లో, యాసంగి రైతు భరోసా (Rythu Bharosa) నిధులు సోమవారం ఉదయం 10 గంటల నుంచి జమ అవుతున్నాయి. ముందుగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతను ఇస్తూ ఎకరం, అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నట్లు తెలుస్తోంది.అంటే ఎకరం పైన ఎంత భూమి ఉన్నా.. మొదటి విడతలో రూ.6 వేలు మాత్రమే ఇస్తుండటం గమనార్హం. కాగా, ఖమ్మం జిల్లాలో 3.58 లక్షల మంది పట్టదారులు ఉండగా, కొత్తగూడెం జిల్లాలో 1.91లక్షల మంది రైతులు ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం చేసే గిరిజనేతర రైతుల (Non Tribal Farmers)కు ఎలాంటి గుర్తింపు లేదు. ఎంతో కాలంగా వంశపారంపర్యంగా వస్తున్న భూమిని నమ్ముకుని గిరిజనేతర రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అయినప్పటికీ వారికి హక్కు పత్రాలు లేవు, పట్టాలు రావు, బ్యాంక్ రుణాలకు వారు అనర్హులు.. ఇక రైతు భరోసా మీద ఆశలు కూడా లేవని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం తరఫున రైతు భరోసా, కేంద్రం తరఫున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులతో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు లబ్ధి పొందుతుంటే మాకు మాత్రం ఏ పథకం ఎందుకు వర్తించడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనేతర రైతులు ప్రశ్నిస్తున్నారు. ముందు తరాల నుంచి సంక్రమిస్తున్న భూములను సేద్యం చేసుకోవడం తప్ప, ఇక్కడి రైతులు కొత్తగా భూములు కొనే పరిస్థితి లేదు. ఏదైనా ఆపద వచ్చి భూమిని అమ్ముకుందామనుకున్నా ఇక్కడ కొనే నాథుడే లేడు. ఏజెన్సీకి బయట ఎకరం భూమి ఉన్న రైతు కూడా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే నేడు తెలంగాణలో ఎక్కడైనా ఎకరం భూమి కనీసం రూ.20 లక్షలకు తక్కువ లేదు. కానీ, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులకు 10 ఎకరాలు ఉన్నా ఒక భద్రత అంటూ లేకపోవడం గమనార్హం.
నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు యాసంగి పెట్టుబడి సాయం పొంది సంతోషంతో సంబరాలు చేసుకుంటుండగా…ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతర రైతులు మాత్రం పెట్టుబడి దేవుడెరుగు కనీసం భూమి హక్కు పత్రాలు ఇవ్వండని నేతల దగ్గర ప్రాధేయపడుతున్నారు.

