కలం, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్మించనున్న రాజధాని నగరం అమరావతిలో కట్టేవి ఐకానిక్ భవనాలు అని మంత్రి నారాయణ (Minister Narayana) వ్యాఖ్యానించారు. రాజధానిపై వైఎస్సార్సీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే మంచి అసెంబ్లీ భవనం ఏపీలో ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. అమరావతి రాజధాని ఎలా కడతారని వైఎస్సార్సీపీ భ్రమలో ఉందని విమర్శించారు. రాజధాని కోసం చేసిన అప్పులు.. ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా తీరుస్తామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళిక లేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రగతి ఆగిపోయిందన్నారు.
అటు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి మంత్రి డీబీవీ స్వామి (DBV Swamy) కౌంటర్ ఇచ్చారు. బూతులు మాట్లాడే కొడాలి నాని.. నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి, అరాచక చరిత్ర ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. గత ఐదేళ్లు జగన్ చేసిన అరాచకాలు భరించలేకే వైసీపీని ప్రజలు తరిమికొట్టారని విమర్శించారు. ప్రజల ఆశీస్సులతో కూటమి పాలన సుదీర్ఘకాలం కొనసాగుతుందని ఆయన ఆకాంక్షించారు. వైసీపీ నేతలు ఇకనైనా చేసిన పాపాలకు పశ్చాత్తాపడాలని సూచించారు.

