కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరెంట్ కోతలు అనేదే లేదని, వర్షాలు, ఈదురుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల స్తంభాలు, లైన్లపై చెట్లు కూలినప్పుడు మాత్రమే తాత్కాలికంగా పవర్ కట్స్ అవుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. బుధవారం హనుమకొండలోని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) ప్రధాన కార్యాలయంలో విద్యుత్ రంగ ప్రగతిపై అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రతికూల వాతావరణ ప్రభావంతో వర్షాకాలంలోనూ విద్యుత్ డిమాండ్ వేసవిని తలపించిందన్నారు.
జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయినా 7,000 మెగావాట్ల అదనపు భారాన్ని తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా తట్టుకుందని భట్టి (Deputy CM Bhatti) చెప్పారు. సాధారణంగా వర్షాకాలంలో 11,000 మెగావాట్లుగా ఉండే పీక్ డిమాండ్ అనూహ్యంగా 16,500 మెగావాట్లకు చేరడం, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేక 2,000 మెగావాట్ల జల విద్యుత్ (హైడల్ పవర్) నిలిచిపోవడం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడిందన్నారు.
NPDCL పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి బృహత్తర ఎత్తిపోతల పథకాలతో పాటు వర్షాభావంతో రైతులు బోర్ వెల్స్ ఎక్కువగా వాడటం వల్ల పెరిగిన విద్యుత్ అవసరాలను ప్రభుత్వం విజయవంతంగా మేనేజ్ చేసిందని చెప్పారు. ‘ప్రజా బాట’, ‘పొలం బాట’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అధికారులు స్వయంగా ప్రజల వద్దకే వెళ్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. రుణభారం తగ్గించి, NPDCL, SPDCL డిస్కంలను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని భట్టి ధీమా వ్యక్తం చేశారు.
విద్యుత్ సేవా ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు దేశంలోనే ప్రథమంగా తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గతంలో వైద్యారోగ్య శాఖలో 108 అంబులెన్స్ సేవలు తీసుకొచ్చిన తరహాలోనే, ఇప్పుడు విద్యుత్ అత్యవసర సమస్యల కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, నిచ్చెనలు, వైర్లతో పాటు నిపుణులైన ఇంజనీర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా E వాహనాలను రంగంలోకి దించినట్లు చెప్పారు.
దీని ద్వారా వినియోగదారులు ఉచిత టోల్ ఫ్రీ నంబర్ 1912 కు ఫోన్ చేయగానే, ఆటోమేటిక్‌గా క్షణాల్లో ఏఐ ద్వారా సమాచారాన్ని ఆంబ్యులెన్స్ సిబ్బందికి చేరవేస్తుందని… మెసేజ్ ఆధారంగా అంబులెన్స్ నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను తక్షణమే పరిష్కరిస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు సీఎండీ వరుణ్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

