Mobile Popup Ad
Mobile Popup Ad

గ్యాస్​ కొరత.. కేంద్రం క్లారిటీ !

కలం, వెబ్ డెస్క్: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ (LPG Shortage) లభ్యతపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం కలగవచ్చని భయపడుతున్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దేశీయ ఎల్పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా ఉందని, సాధారణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా కొనసాగుతోందని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది.

ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ప్రజలు భయపడుతూ ముందుగానే ఎక్కువగా సిలిండర్లు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అవసరమైనన్ని సిలిండర్లు వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ముందుజాగ్రత్తగా శుద్ధి కర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 25 శాతం వరకు పెంచినట్లు సమాచారం.

ఇటీవల దేశంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు ఈ వ్యవధిని 45 రోజులకు పెంచిన విషయం తెలిసిందే. అయితే కొన్నిచోట్ల గ్యాస్ డీలర్లు సిలిండర్ డెలివరీలను ఆలస్యం చేస్తున్నారనే, అదనపు రుసుములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.

వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ సకాలంలో డెలివరీ అందకపోతే లేదా డీలర్లు అనుచితంగా వ్యవహరిస్తే నేరుగా గ్యాస్ కంపెనీల హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. హిందుస్తాన్ పెట్రోలియం గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 టోల్ ఫ్రీ నంబర్ లేదా 9493602222 ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్ వినియోగదారులు 1800-22-4344 టోల్ ఫ్రీ నంబర్ లేదా 7715012345 ద్వారా బుకింగ్ చేయవచ్చు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 టోల్ ఫ్రీ నంబర్ లేదా 7718955555 నంబర్ ద్వారా బుకింగ్, ఫిర్యాదులు నమోదు చేయవచ్చు.

ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరాలపై ఎలాంటి ప్రభావం పడినా దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేసే ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఎలాంటి అంతరాయం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>