epaper
Monday, November 17, 2025
epaper

యూపీఐ లావాదేవీలపై చార్జీల్లేవ్.. క్లారిటీ ఇచ్చిన రిజర్వు బ్యాంకు

కలం డెస్క్ : నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలు తార స్థాయికి చేరుకున్నాయి. అనేక రూపాల్లో ప్రజలు, వినియోగదారుల నుంచి పన్నులు, సెస్, చార్జీలను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపైనా వసూలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచన ఏదీ లేదని, కనీసం ప్రతిపాదనలు కూడా రాలేదని రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) స్పష్టం చేశారు. డిజిటల్ పేమెంట్లను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు నగదు లావాదేవీలపై ఆంక్షలు విధించింది. ప్రతి ఏటా అనేక కొత్త ఆంక్షలు వస్తుండడంతో నగదు లావాదేవీలు తగ్గి వాటి స్థానంలో యూపీఐ (డిజిటల్) ట్రాన్సాక్షన్లు పెరిగాయి.

నాలుగేండ్లలో ఐదు రెట్లు :

యూపీఐ లావాదేవీల విధానాన్ని తొలుత 2016లో ప్రవేశపెట్టినా నోట్ల రద్దు తర్వాత మాత్రమే ఊపందుకున్నది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం 2021-22లో యూపీఐ లావాదేవీల సంఖ్య (సంవత్సరానికి) నాలుగున్నర వేల కోట్లు (46 బిలియన్) ఉండగా, 2024-25 సంవత్సరానికి అది నాలుగు రెట్లు పెరిగి దాదాపు 19 వేల కోట్ల (186 బిలియన్లు)కు చేరింది. దేశంలో దాదాపు 40 కోట్ల మంది జనాభా యూపీఐ వాడుతున్నారు. ఫోన్ పే లాంటి ప్రైవేటు ప్లాట్ ఫామ్ ను దాదాపు 60 కోట్ల మంది వినియోగిస్తున్నట్లు అంచనా. సగటున నెలకు 1400 కోట్ల లావాదేవీలు చోటు చేసుకుంటున్నాయని, ఈ ఏడాది జనవరిలో గరిష్టంగా 1700 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు యూపీఐ తెలిపింది. సగటున రోజుకు 63 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి.

చార్జీలు వేయబోమన్న ఆర్బీఐ :

ఇంతటి భారీ స్థాయిలో ప్రతి నిత్యం లావాదేవీలు జరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం యూజర్ చార్జీల పేరుతో ప్రతీ లావాదేవీపై ఎంతో కొంత రుసుము విధిస్తుందన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇలాంటి వార్తలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) వివరిస్తూ.. అలాంటి ఆలోచన లేదని, ఇప్పటివరకు ప్రతిపాదన కూడా రాలేదని, కొత్తగా చార్జీలు వసూలు చేయాలనే నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>