క్రికెట్‌లో ఇదేం రన్‌అప్.. 100 కి.మీ!

కలం, స్పోర్ట్స్ : క్రికెట్‌లో రన్‌అప్ అంటే కొన్ని అడుగులు.. కానీ ఇక్కడ ఏకంగా 100 కిలోమీటర్లు! ఇంగ్లాండ్‌కు చెందిన 22 ఏళ్ల సామ్ బొడానో (Sam Bodano) ఈ అసాధారణ సాహసం చేశాడు. లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి సర్రేలోని వ్యాలీ ఎండ్ క్రికెట్ క్లబ్ వరకు 100 కి.మీ పరుగెత్తాడు (100 KM Bowling Runup). ఈ ప్రయాణానికి దాదాపు 14 గంటలు పట్టింది. శనివారం లార్డ్స్ నుంచి బొడానో పరుగును ప్రారంభించాడు. ఆదివారం వ్యాలీ ఎండ్ క్రికెట్ క్లబ్‌కు చేరుకున్నాడు. అక్కడ 11 మంది సభ్యులతో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతిని తన తండ్రికే వేశాడు.

ఈ ప్రయత్నంలో బొడానో పూర్తి క్రికెట్ దుస్తుల్లోనే పరుగెత్తాడు. చేతిలో క్రికెట్ బంతిని కూడా పట్టుకున్నాడు. ఇవి గిన్నిస్ రికార్డు ప్రయత్నానికి అవసరమైన నిబంధనల్లో భాగం. బొడానో లక్ష్యం.. క్రికెట్‌లో అత్యంత పొడవైన బౌలింగ్ రన్‌అప్ రికార్డును బద్దలు కొట్టడం. ప్రస్తుత పురుషుల రికార్డు 15 మైళ్లు, అంటే 24 కిలోమీటర్లు. అయితే బొడానో రికార్డు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఈ ప్రక్రియ పూర్తయ్యాకే తుది నిర్ణయం వెలువడనుంది. ఈ సాహసం మరో మంచి పనికి కూడా ఉపయోగపడింది. క్యాన్సర్ బాధిత కుటుంబాలకు సేవలందించే రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ కోసం దాదాపు 6 వేల పౌండ్లు సేకరించాడు. తనకు చాలా అలసటగా ఉన్నప్పటికీ, మంచి కారణం కోసం ఈ ప్రయత్నం చేసినందుకు సంతోషంగా ఉందని బొడానో తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>