కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో “సేవకు గుర్తింపు – సేవకులకు గౌరవం – సమాజానికి స్ఫూర్తి” అనే నినాదంతో సేవా స్ఫూర్తి అవార్డ్స్ (Seva Spoorthi Awards) కార్యక్రమం నిర్వహించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలను సన్మానించి, సంస్థ చేపట్టిన సేవా కార్యకలాపాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా, నిరంతరం సేవలు అందిస్తున్న సేవామూర్తులను గుర్తించి వారికి గౌరవం అందించడం అత్యంత ఆనందదాయకం అన్నారు. సేవ అనేది ఏదైనా పదవి లేదా బిరుదు కాదు.. అది మనసు నుంచి పుట్టే మానవత్వం అని పేర్కొన్నారు. ఈ అవార్డులు సేవా స్ఫూర్తిని మరింతగా ప్రోత్సహించి, యువతలో సేవా భావనను పెంపొందించేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ నగరంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని, సమాజంలో సేవా స్పృహ పెరగాలని కోరారు. సేవ చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు.

