పెద్ద కొడుకుగా అండగా ఉంటా : మేఘారెడ్డి

కలం, వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌ఓసీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా అండగా ఉంటున్నానని, తాను అందిస్తున్న సాయం ఎమ్మెల్యేగా తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుతో నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 32 వేల మందికి రేషన్‌ కార్డులు అందించామని, సన్నబియ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే (Megha Reddy) తెలిపారు. విద్యాభివృద్ధికి రూ.600 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని, 500 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ వంటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త్వరలో రూ.240 కోట్లతో పారిశ్రామిక రంగానికి సంబంధించిన సెక్టార్‌ ప్రారంభం కానుందని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, స్వయం ఉపాధి అవకాశాలు, సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్‌, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమం అందలేదని ఎమ్మెల్యే విమర్శించారు. రోడ్ల వెంట లైట్లు, డివైడర్లు, చెరువుకట్టల రివిట్మెంట్‌ పనులకే పరిమితమైందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మేఘారెడ్డి.. ఆ పార్టీ అంతర్గత పరిస్థితులపై పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కారు పార్టీ టైర్లు ఊడిపోయాయని, స్టీరింగ్‌ పాడైందని, ప్రస్తుతం ఆ కారు రోడ్డుపైకి రావడం కష్టమని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందే అనేక ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఉందన్నారు. గతంలో నిర్మించిన కాలువలకు బొక్కలు పెట్టిన నాయకులు తామే నీళ్లు తెచ్చినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు, మున్సిపల్‌ చైర్మన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పెబ్బేరు మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>