కలం, మెదక్ బ్యూరో: ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట (Papannapet) మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఏఎస్సై తుక్కయ్య తెలిపిన వివరాల ప్రకారం.. టెక్మాల్ మండలం కాదులూరు గ్రామానికి చెందిన మొల్ల దస్తగిరి (23), మారిగారి బాబు (23) రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బాబు తన బైక్ సర్వీసింగ్ నిమిత్తం దస్తగిరితో కలిసి మెదక్ వెళ్లాడు. పనులు ముగించుకుని రాత్రి వేళ తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు.
పాపన్నపేట గ్రామ శివారులోని అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకోగానే, ఎదురుగా అతివేగంగా వచ్చిన జేసీబీ వీరి బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న దస్తగిరితో పాటు వెనుక కూర్చున్న బాబుకు తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు దస్తగిరి తండ్రి గూడూసాబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో కాదులూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

