Mobile Popup Ad
Mobile Popup Ad

అనాథ శవాలకు కాశీలో పిండ ప్రదానం చేసిన ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ

కలం, నిజామాబాద్ బ్యూరో: “అనాథ ప్రేత సంస్కరేణ కోటి పుణ్య ఫలం లబేత్”.. అన్న శాస్త్ర వచనాన్ని నమ్మింది నిజామాబాద్ (Nizamabad) ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ (Youth Charity organization). అనాథల ఆత్మలకు సద్గతి కలిగేలా అస్థికలను కాశీలో కలిపి శాస్రోక్తంగ సామూహిక పిండ ప్రదానం చేస్తోంది. సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ఆధ్వర్యంలో సభ్యులు కాశీకి వెళ్లారు. 30 మంది అనాథ శవాలకు చెందిన అస్తికలను గంగా నదిలో కలిపి కాశీలోని మణికర్ణిక ఘాట్ లో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు. వారందరి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకున్నారు. అనాథలకు ఎవరూ పట్టించుకోరు కాబట్టి తాము ఆ బాధ్యత భుజాన వేసుకున్నామని సంస్థ అధ్యక్షుడు సాయి బాబు అంటున్నారు. అనాధల అంత్యక్రియలు జరిపిస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని దేవి భాగవతంలోనే చెప్పినట్టు తాము బాధ్యతగా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘట్టం తమకు ఎంతో సంతృప్తిని అందిస్తుందని చెప్పడం విశేషం. అంటుడు ముట్టుడు అనేది ఉండదని.. యువత తమ తల్లిదండ్రులు, సొంత వారి పట్ల ప్రేమా అనురాగాలు కలిగి ఉండాలని, చివరి మజిలీ బాధ్యతగా నిర్వహించాలని సాయి బాబు ఆకాంక్షించారు. తమ దృష్టికి వచ్చిన అనాథల శవాల గురించి ప్రస్తావిస్తూ ఆకలిదప్పులతో అలమటిస్తూ రోడ్లపై అనారోగ్యంతోనే ఎక్కువగా చనిపోయారని చెప్పారు. కుటుంబ సభ్యులు మానవతా విలువలను తెలుసుకోవాలని, తమ వారు అనాథలుగా మారకుండా చూడాలని వేడుకున్నారు. ఆ విలువలు తగ్గాయి కాబట్టే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందంటున్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.మద్దుకూరి సాయిబాబుతో పాటు దర్శనం రాజు, ఇందురి శేఖర్, గంగారాం , గండ్లా విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శం ఇందూరు యువత సేవలు..

లోకం ‘శవం’ అని అసహ్యించుకుని, కుళ్లిపోయి పురుగులు పట్టిన దేహాలను చూసి ముక్కు మూసుకుని తప్పుకుంటే.. ఆ దేహాలలో ‘దైవాన్ని’ చూస్తున్నామని ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు చెబుతున్నారు. ఎవరూ లేని అనాథ శవాలకు ఆత్మబంధువై పాడె కట్టి కన్న బిడ్డలు కూడా వెనకడుగు వేసే చోట భుజంపై పాడెను మోస్తూ, కుండ పట్టుకుని, తలకొరివి పెట్టి, పిండ ప్రదానం నుంచి తలనీలాల వరకు అన్ని కార్యాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక కన్నబిడ్డగా చేయాల్సిన ప్రతి బాధ్యతను పూర్తి చేస్తున్నామని.. ఇప్పటివరకు 168 అనాథలకు అంతిమ సంస్కారాలు పూర్తి చేశామని వెల్లడించారు. చచ్చిపోతున్న మానవత్వానికి ప్రతిరోజూ ఊపిరి పోయాలని లక్ష్యంతో ఇందూరు యువత చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>