పసుపు బోర్డు.. ఏర్పాటై ఏడాదైనా అద్దె ఆఫీసుకే పరిమితం

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రపంచంలోనే నాణ్యమైన కర్క్యూమిన్ పసుపు దొరికే ప్రాంతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్. పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు దశాబ్దాల పాటు ఉద్యమం చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఎన్నికల్లో మాట ఇచ్చి కేంద్రాన్ని ఒప్పించి బోర్డు సాధించారు. అంతే కాదు కేంద్రంలో ఉండాల్సిన బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయించారు. అలాంటి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ భూమి దొరకడం లేదు. ఏడాది అవుతున్నా అద్దె భవనంలోనే బోర్డు కొనసాగుతోంది. తొలి ఏడాదిలోనే మంజూరైన రూ. 5 కోట్ల కేంద్ర బడ్జెట్ ల్యాప్స్ అయిపోయాయి. ఇదీ పసుపు బోర్డు గోడు.

రాజకీయ అడ్డంకులు

నిజామాబాద్ కు మంజూరైన పసుపు బోర్డుకు శాశ్వత భవనం కోసం రాజకీయ అడ్డంకులు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు తమకు ఎలాంటి అనుమతి రాలేదని అధికారులు సైతం దాటవేస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్లోని ఆర్యనగర్ లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను పసుపు బోర్డు కోసం నెలకు రూ. 50 వేల అద్దెకు తీసుకున్నారు. అందులో బోర్డు ఆఫీస్ ఏర్పాటై ఏడాది అవుతోంది. దీనికి డిప్యూటీ డైరెక్టర్ గా స్పైస్ బోర్డు డీడీనే నియమించారు. బోర్డుకు కొత్త ఆఫీసు లేకపోవడంతో బడ్జెట్ వెనక్కి పోయింది. రైతులకు శిక్షణలు నిర్వహించే పరిస్థితి లేదు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాల తయారీ, ఆధునిక సాగుపై అవగాహన కొరవడుతోంది. రైతులకు ఎప్పటికప్పుడు సదస్సులు ఏర్పాటు చేసే పరిస్థితులు కూడా లేవు.

మార్కింగ్ అయినా తప్పని గ్రహణం

పసుపు బోర్డు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కోసం కలెక్టర్లను వరుసగా కోరుతూ వస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జడ్పీ ఆఫీసు వెనుక ఉన్న రెండెకరాల స్థలాన్ని బోర్డు ఆఫీసు నిర్మాణానికి అధికారులు పరిశీలించారు. సర్వే మార్కింగ్ కూడా చేశారు. కానీ, స్థలం ఖరారు చేయడంలో జాప్యమైంది. ఇందుకు ప్రధాన పార్టీల రాజకీయాలే కారణమని తెలుస్తోంది. బోర్డు ఆఫీసు నిర్మాణానికి సకాలంలో స్థలం చూపని కారణంగా రూ.5 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి వెళ్లాయి. దీంతో అద్దె భారం తప్పడం లేదు.

వేల్పూర్ లో నిరుపయోగంగానే స్థలం

బాల్కొండ సెగ్మెంట్ లోని వేల్పూర్ సమీపంలో పసుపు పార్కు కోసం 2015లో 40 ఎకరాలు కేటాయించినట్టు హడావుడి చేశారు. రూ. 5 కోట్లు వెచ్చించి స్థలం కొనుగోలు చేశారు. రూ.2 కోట్లతో ప్రహరీ, సీసీరోడ్లు నిర్మించారు. అందులో స్పైస్ రీజినల్ ఆఫీస్ కు కేటాయించినట్టు కూడా ఆర్భాటం చేశారు. అప్పట్నుంచి వినియోగంలోకి తేకుండా వృథాగా వదిలేశారు. పరిశ్రమల స్థాపనలో భాగంగా ఔత్సాహికులకు ఈ స్థలం కేటాయిస్తామనే ఆలోచన కార్యరూపం దాల్చడం లేదు.

త్వరగా స్థలం కేటాయించాలి

రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిజామాబాద్ లో పసుపు బోర్డు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కోసం త్వరగా భూమి కేటాయించాలి. ఈ విషయమై పలువురు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాం. బోర్డు బిల్డింగ్ నిర్మాణానికి 2 ఎకరాలు జిల్లా కేంద్రంలో కేటాయిస్తే అడ్మినిస్ట్రేషన్ సులువు అవుతుంది. అందులో మిగిలే భూమిలో శిక్షణ, పరిశోధనల అవసరాలకు ఉపయోగంగా ఉంటుంది. త్వరగా భూమి కేటాయిస్తే పసుపు రైతులకు మేలు జరుగుతుంది. ఇంకా జాప్యం చేస్తే.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.
– పల్లె గంగారెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>