కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మల్కాజిగిరి (Malkajgiri) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. చాక్లెట్ ఇస్తానని నమ్మించి, నాలుగేళ్ల అమాయక చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటున్న చిన్నారికి నిందితుడు చాక్లెట్లు చూపి ఆశ పెట్టాడు. ఆపై ఎవరూ లేని సమయం చూసి ఆ బాలికపై పాశవికంగా లైంగిక దాడికి ఒడిగట్టాడు.
ఘటన జరిగిన అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి, జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించడంతో ఈ దారుణం బయటపడింది. ఆందోళనకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని మల్లికార్జున్ నగర్‌లో ఓ టెంట్‌హౌస్‌లో పనిచేసే రవికుమార్‌గా గుర్తించారు. నిందితుడు రవికుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

