కలం, వెబ్ డెస్క్ : న్యూఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిరసన కారులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. జులై 20న జరిగిన లాఠీచార్జ్ (Jantar Mantar Lathi Charge) ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై లాఠీచార్జ్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనే అంశంతో పాటు, గాయపడిన వారికి అందించిన వైద్య సహాయం, ఘటన అనంతరం తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు నివేదికలో పొందుపరచాలని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. అలాగే, ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.
లాఠీచార్జీ ఘటనకు దారితీసిన పరిస్థితులు, పోలీసుల చర్యలు, నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఎన్హెచ్ఆర్సీ తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జంతర్‌మంతర్ నిరసనల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణ ప్రారంభించడం కీలక పరిణామంగా మారింది.

