కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం ప్రొఫెసర్ విభాగాధిపతి, న్యూరో సైకియాట్రిస్ట్, మాదకద్రవ్యాల వ్యసన నివారణ నిపుణులు, ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షులు డా. విశాల్ ఆకుల (Dr Vishal Akula) ప్రతిష్ఠాత్మక డా. కేతన్ దేశాయ్ “ఆవో గావ్ చలేన్” జాతీయ అవార్డు (గ్రామీణ సేవలు)కు ఎంపికయ్యారు. భారతదేశంలో వైద్యుల అతిపెద్ద వృత్తిపరమైన సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) గ్రామీణ ఆరోగ్య సేవలు, కమ్యూనిటీ మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, మాదకద్రవ్యాల వ్యసన నివారణ, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు, సమాజానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించింది.
ఐఎంఏ జాతీయ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. జూలై 18న న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవంలో ఐఎంఏ జాతీయ నాయకత్వం సమక్షంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా డా. విశాల్ ఆకుల మాట్లాడుతూ.. ఈ గౌరవానికి ఎంపిక చేసిన ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డా. అనిల్‌కుమార్ జే. నాయక్, గౌరవ ప్రధాన కార్యదర్శి డా. సర్బారి దత్తాలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డా. పి. కిషన్, గౌరవ ప్రధాన కార్యదర్శి డా. అశోక్ దయాల్ సింగ్, గౌరవ కోశాధికారి డా. దయాల్ సింగ్లకు తమ ప్రోత్సాహం, మార్గదర్శకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా డా. ఈ. రవీంద్ర రెడ్డి, డా. టి. జీవన్ రావు, డా. డి. హరీష్ స్వామి, అలాగే ఐఎంఏ నిజామాబాద్ సభ్యులందరికీ తమ సహకారం, విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును తన రోగులకు, సహచర వైద్యులకు, విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ప్రతి ఆరోగ్య కార్యకర్తకు అంకితం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే, శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. డా. విశాల్ ఆకుల ఎంపిక తెలంగాణ రాష్ట్ర వైద్య రంగానికీ, నిజామాబాద్ జిల్లాకూ గర్వకారణంగా నిలిచిందని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.

