కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరులో వాతావరణం క్రమంగా మారుతోంది. వర్షాల రాకతో చల్లబడింది.. కానీ పాలిటిక్స్ మాత్రం ఒక్కసారిగా హీటెక్కాయి. ఇందుకు కారణం ఇద్దరు గుప్తాల నడుమ మాటల యుద్ధమే (BRS vs BJP) కారణం. తాము ధర్నాకు వెళ్తున్నామని తెలిసి బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నెల రోజులు బంద్ ఉన్న మినీ ట్యాంక్ బండ్ ను వెంటనే తెరిపించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆరోపించారు. ట్యాంక్ బండ్ ను తాను అభివృద్ధి చేశానని.. దీనివల్ల తనకు పేరు వస్తుందని, ట్యాంక్ బండ్ ను పూర్తి చేయడం లేదని, కొత్తగా అభివృద్ధి కూడా చేయడం లేదని మండిపడ్డారు. కనీసం డివైడర్ ల పై ఉన్న చెట్లకు కూడా నీళ్ళు లేక ఎండిపోతున్నాయని.. ఆ చెట్ల వల్లే నిజామాబాద్ కు ఢిల్లీ దాకా పేరు వచ్చిందని.. అవార్డు వచ్చిందని వాదిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే తీరు చూస్తుంటే మాటలే తప్ప చేతలు లేవని అర్థమైందని దుయ్యబట్టారు. ధన్ పాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలకు బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ కౌంటర్ ఇచ్చారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన మాజీ ఎమ్మెల్యే బిగాల నాకు చెప్పేది ఏంటి? అంటూ ఒంటి కాలిపై లేచి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ లు తీసుకోవడం కోసం ఆ చెట్లు పెట్టారని.. 4 వేలు ఖర్చు అయ్యే చెట్లకు 40 వేలు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడం మానేసి మాపై పడితే ఏం వస్తుందని ప్రశ్నించారు. అధికారం దూరం అయిన అసహనం తో అలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. బిగాల గణేష్ తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తాను ఎవరి దగ్గర అయినా ఏ శాఖలో అయినా అవినీతికి పాల్పడితే నిరూపించాలని.. ”గణపతి గుడికి రా అంటూ”! సవాల్ విసిరారు. ఇద్దరు గుప్తాల మధ్య మాటల యుద్ధంతో వర్షంతో చల్లవడ్డ ఇందూరు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.
నిజామాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు BRS ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్ బండ్ (బొడ్డెమ్మ చెరువు) నెల రోజులుగా మూతపడి ఉండటం, దీనిపై ప్రజలు, వాకర్స్, యువత స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని బిగాల గణేష్ గుప్తా అన్నారు. ”మేము ఆందోళనకు వస్తున్నామనే విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే ధన్‌పాల్ తన పరువు పోతుందని గ్రహించి హడావుడిగా గేట్లు తెరిపించారు. నెల రోజులుగా మూసివేసి ఉంచిన గేట్లు ఒక్కసారిగా ఎలా తెరుచుకున్నాయని ప్రశ్నించారు. ప్రజల కోసం కాకుండా, తమ వైఫల్యం బయటపడకుండా ఉండేందుకు మాత్రమే గేట్లు తెరిపించడం ఎమ్మెల్యే రాజకీయ నాటకాలకు నిదర్శనం. గతంలో తాము హెచ్చరించినట్లుగానే అక్కడ నాటిన చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది లేదు. విద్యుత్ దీపాలు పనిచేయక చీకటిమయంగా మారింది. సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పారిశుధ్య నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉంది. కొత్తగా అభివృద్ధి పనులు చేయడం పక్కన పెడితే, ఇప్పటికే నిర్మించిన ప్రజా ఆస్తులను కూడా రక్షించలేని పరిస్థితి నెలకొనడం విచారకరం. నిజామాబాద్ నగరంలో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్‌ని డిల్లీకి పిలిపించుకొని అవార్డు కూడా ఇచ్చింది” అని బిగాల గణేష్ గుప్తా చెప్పుకొచ్చారు.
”BRS ప్రభుత్వ హయం లో గణేష్ బిగాల ఆధ్వర్యంలో 20కిలోమీటర్ల పైచిలుకు డివైడర్లలో మొక్కలు నాటడం జరిగింది. దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్త కూడా కల్పించడం జరిగింది. అందుకే THE BEST GREEN CITY అని అవార్డ్ వచ్చింది. కానీ ఈరోజు దానికి బిన్నంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడం జరిగింది. వేసవి కాలం కన్నా ముందే గణేష్ బిగాల హెచ్చరించినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే ధన్‌పాల్ పెడ చెవిన పెట్టీ కనీసం పట్టించుకోలేదు. దాని పర్యవసనమే చెట్లు ఎండిపోవడం. ఇది చూసిన గణేష్ బిగాల బాజిరెడ్డి గోవర్ధన్ BRS కార్యకర్తలు చలించిపోయి BRS పార్టీ ఆధ్వర్యంలో బిందెలతో నీళ్లు తెచ్చి చెట్లకు పోసి నిరసన తెలిపాం. కనీసం ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యే దన్ పాల్ పట్టించుకొని చెట్లను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఎన్నికల సమయంలో అభివృద్ధి పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నగర అభివృద్ధిని పక్కనపెట్టి నిజామాబాద్ ను సమస్యలతో నిండిన నగరంగా మార్చారు. రోడ్లు, పారిశుధ్యం, మౌలిక వసతులు, ప్రజా అవసరాల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. నైతిక బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి.
చర్చకు సిద్దం.. బిగాల గణపతి గుడికి రా..
”కమిషన్…కరప్షన్.. కలెక్షన్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అలవాటు పడ్డాడు. కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ములేక నాపై ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధి పై చర్చకు సిద్ధమని సవాల్ చేస్తున్నా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బిగాల నగరానికి ఎప్పుడో ఒకసారి వస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 60 స్థానాల్లో ఒకటే సీటును గెలుపొంది, కనీసం ఆ ఒక్క సీటును కూడా కాపాడుకోలేని అసమర్ధ నాయకుడు బిగాల. తాను గెలిచిన తర్వాత గతంలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నాను. ఇది జీర్ణించుకోలేని బిగాల అనవసర ఆరోపణలు చేస్తున్నారు. బిగాల పదేళ్లు అధికారంలో ఉన్నా.. అర్బన్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇప్పించలేదు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఆయనను రాజీనామా చేయమని ఎందుకు అడగలేదు. అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ లో ఒక్క ప్రముఖ కంపెనీ కూడా తీసుకు రాలేదు.. మరి కేటీఆర్ ని రాజీనామా చేయమని నిలదీశాడా?.. కేవలం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే పని చేశాడే తప్ప..నిజామాబాద్ అభివృద్ధికి కాదు. కమిషన్ కరప్షన్ కలెక్షన్ కు అలవాటు పడి పదేళ్లు పాలించాడు. ఇటీవల తాను మంత్రులపై ఒత్తిడి తేవడంతో నగరంలో 396 ఇల్లు కేటాయించారు. అలాగే మరో వారంలో నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ను కలుస్తాను. ఇటీవల నగరంలోని మినీ ట్యాంకుబండ్ పై బిగాల గణేష్ గుప్తా అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ కాంట్రాక్టర్ సమయం ముగియడంతో తాళాలు వేసి వెళ్లారు. కొత్త కాంట్రాక్టర్ నియమంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, కార్పొరేషన్ పై ఉంది. అదే మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేసిన చెట్లలో అవినీతికి పాల్పడ్డ చరిత్ర బిగాలది. నాలుగున్నర వేల ఒక్కో చెట్టును 45 వేలుగా చూయించి దోచుకున్నారు. అలాగే కార్పొరేషన్ లో ఒక్క మనిషి విధులు నిర్వహించుకున్నా.. 330 మంది పనిచేస్తున్నట్లు రికార్డుల్లో చూయించి నెలకు 50 లక్షలు దోచుకున్నారు. ఏ శాఖలో అయినా తాను ఒక్కరూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్దం. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల గణపతి ఆలయం ముందుకు రా.. నేను వస్తాను” అని బిగాల గణేష్ కు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సవాల్ విసిరారు. తన హయాంలో ఒక్క గుంట భూమి కొనుగోలు చేయలేదని, బిగాల మాత్రం ఒక్క గుంట కూడా విడిచిపెట్టలేదన్నారు. అలాగే ఆర్యవైశ్యులు అంటే దానధర్మాలకు ప్రతిక అని, కానీ బిగాల మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నారని మండిపడ్డారు.

