Mobile Popup Ad
Mobile Popup Ad

జల దిగ్బంధంలో భద్రాద్రి? పోలవరంతో పొంచి ఉన్న ప్రమాదం!

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భౌగోళిక, సాంకేతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక వైపు వర్షాకాలం సమీపిస్తుండటం, మరో వైపు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావస్తుండటంతో, బ్యాక్ వాటర్ రూపంలో భద్రాద్రి జిల్లా మనుగడకే ముప్పు పొంచి ఉందని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం వరదలు వచ్చినప్పుడు మాత్రమే మునిగే భద్రాచలం, పోలవరం నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా జలదిగ్బంధంలోనే బతకాల్సి వస్తుందన్న విశ్లేషణలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

​సాధారణంగా నదికి వరదలు వస్తే నీరు ఉధృతంగా ప్రవహించి కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది. కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరినప్పుడు ఏర్పడే మార్పులు భద్రాచలం, బూర్గంపాడు పట్టణాల ఉనికికే శాశ్వత ప్రమాదంగా మారనున్నాయి. పోలవరం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండితే, వెనక్కి తన్నే నీటి ప్రభావం వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం సాధారణ రోజుల్లో కూడా దాదాపు 45.5 అడుగుల వద్ద స్థిరంగా ఉంటుంది. దీనివల్ల భద్రాచలం పట్టణ ప్రజలు ఏడాది పొడవునా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొట్టుమిట్టాడాల్సి వస్తుంది.

నదిలో నిరంతరం భారీ స్థాయిలో నీరు నిలిచి ఉండటం వల్ల, భద్రాచలాన్ని రక్షిస్తున్న కరకట్టల పునాదులు నిరంతరం నాని బలహీన పడతాయి. కాలక్రమేణా ఇవి కోతకు గురైతే, వరద సమయాల్లో కరకట్టలు తెగి పట్టణ మొత్తం జలసమాధి అయ్యే భయానక పరిస్థితులు తలెత్తవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్ వాటర్ ముప్పు కేవలం నది ఒడ్డుకే పరిమితం కాకుండా పట్టణాన్ని లోపలి నుంచే ముంచెత్తేలా చేసే అవకాశం ఉండడం గమనార్హం. భద్రాచలం పట్టణంలోని మురుగునీరు, వర్షపు నీరు గోదావరి నదిలోకి వెళ్లేందుకు ఎనిమిది ప్రధాన తూములు ఉన్నాయి. నదిలో నీటి మట్టం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండటం వల్ల ఈ తూములు సహజంగానే మూసుకుపోతాయి. ఫలితంగా స్వల్ప వర్షాలకే మురుగునీరు వెనక్కి తన్ని పట్టణ లోపలి నుంచే మునిగిపోయే ప్రమాదం ఉంది. 1986లో 75.6 అడుగులు, 2022లో 71 అడుగుల మేర నమోదైన చారిత్రక మహా ప్రళయాలు తాత్కాలికంగా వచ్చి వెళ్లినవే అయినా లోతట్టు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.

అలాగే గోదావరి ఉపనదులైన కిన్నెరసాని, ముర్రేడు వాగులతో పాటు తురుబాక, ఏడులవాగు, పెద్దవాగుల సహజ నీటి పారుదల మార్గాలపై కూడా ఈ బ్యాక్ వాటర్ తీవ్ర ప్రభావం చూపనుంది. నది నిండుగా ఉండటం వల్ల ఈ వాగుల నీరు నదిలోకి వెళ్లకుండా నీటి ఎగపోటు ఏర్పడి పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లోని వ్యవసాయ భూములు, గ్రామాలు శాశ్వతంగా ముంపునకు గురవుతాయి. ముఖ్యంగా అశ్వాపురంలో ఉన్న దేశ రక్షణ, ఇంధన రంగాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘హెవీ వాటర్ ప్లాంట్’ భద్రతకు కూడా భవిష్యత్తులో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

​ఈ భౌగోళిక ముప్పుపై పినపాక, భద్రాచలం నియోజకవర్గాల శాసనసభ్యులు తీవ్రంగా స్పందించారు. పోలవరం ముంపు తీవ్రతను అంచనా వేయడం కోసం రెండు రోజుల నుంచి జిల్లాలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ సంజీవ్ నందన్ సహాయ్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్నతాధికారులను కలిసి క్షేత్రస్థాయి వాస్తవాలను వారి ముందు ఉంచారు. ఈ మేరకు అధికారిక లెక్కల కంటే వాస్తవ పరిస్థితుల్లో ముంపు విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పోలవరం బ్యాక్‌వాటర్ వల్ల నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం వంటి గ్రామాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వందలాది కుటుంబాలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యపై తాను పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులకు పది ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించానని చెప్పారు. తక్షణమే ప్రభావిత గ్రామాల్లో సమగ్ర శాస్త్రీయ బ్యాక్‌వాటర్ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పునరావాస ప్యాకేజీతో పాటు రక్షణ కరకట్టలు, ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించాలని సూచించారు. అలాగే ప్రజాప్రతినిధులు, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరపాలని కోరారు.

ప్రతి ఏటా వరదల వల్ల భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలు నిరాశ్రయులవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ”ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. ఇందుకోసమే నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓను నేరుగా కలిసి సుదీర్ఘంగా చర్చించాను. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, భద్రాచలం పట్టణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను వరదల నుండి శాశ్వతంగా రక్షించేందుకు కరకట్టల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశాను” అని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>