ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణలో 250 మందికి ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

కలం, నిజామాబాద్ బ్యూరో: పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నిజామాబాద్ పోలీస్ (Nizamabad Police) శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో 250 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అందజేశారు.

తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ తదితర ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం అందించి, పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ, ఈ ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగనుంది.

హైదరాబాద్‌కు చెందిన భాగ్య కిరణ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులచే అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో తరగతులు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సమగ్ర మార్గదర్శకత్వం శిక్షణలో భాగంగా పోలీస్ రిక్రూట్‌మెంట్ పోటీ పరీక్షలకు అవసరమైన వివిధ అంశాలపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.

ప్రశ్నలను వేగంగా, ఖచ్చితంగా పరిష్కరించే విధానం, సమయపాలన, పరీక్షా సరళి, ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి తదితర విషయాల్లో నిపుణులచే మార్గదర్శకత్వం అందిస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థుల్లో పోటీ పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు నిరంతర సాధన ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలనీ ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య సూచించారు.

నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో ఒక భాగమని తెలిపారు. పోలీస్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతపై ఆర్థిక భారం పడకుండా నాణ్యమైన శిక్షణ అందించాలనే సంకల్పంతో ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ 60 రోజుల శిక్షణను అభ్యర్థులు ఒక విలువైన అవకాశంగా భావించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరవ్వాలని, అధ్యాపకులు అందించే సూచనలు పాటిస్తూ కష్టపడి చదవడంతో పాటు, నేర్చుకున్న అంశాలను ప్రతిరోజూ పునశ్చరణ చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్ సీటీసీ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, రాజశేఖర్, అధ్యాపక బృందం, శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>