కలం, సినిమా: అనంతపురం జిల్లాలోని రాప్తాడులో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటనపై ప్రముఖ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వార్త వినగానే తీవ్ర ఆవేదనకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు బాలికలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి అడ్డుగా నిలిచిన మరో బాలిక ధైర్యసాహసాలను అభినందించారు. ఆమె చూపిన తెగువ అసాధారణమని, అలాంటి ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో స్పందించిన వైద్య బృందాలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడానికి కారణమవుతున్న మనస్తత్వాన్ని కూడా సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు. గౌరవం అనేది మాటల్లో చెప్పడం మాత్రమే కాదని, ఇంట్లో మన ప్రవర్తనలోనూ, పిల్లలకు నేర్పించే విలువల్లోనూ కనిపించాలని సూచించారు. మహిళల గురించి మనం మాట్లాడే తీరు, వారితో వ్యవహరించే విధానం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళల పట్ల అవమానకరమైన వైఖరిని సాధారణంగా తీసుకోవడం మానేసి, గౌరవం, సానుభూతి, సమానత్వం వంటి విలువలను పాటించే తరాన్ని పెంచాలని తన పోస్టులో పిలుపునిచ్చారు.

