కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) హడావుడి చివరి దశకు చేరకుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన ప్రజా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రారంభం కానుంది. వీటితో పాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక జరుగనుంది. ఈ క్రమంలో నిజామాబాద్ (Nizamabad) మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉంటామని ప్రకటించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) చివరి నిమిషంలో షాకిచ్చారు. తమ అభ్యర్థి కూడా మేయర్ పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు.
ధర్మపురి అర్వింద్ ఎక్స్ వేదికగా ఆదివారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. తాను ఎన్నికల్లో గెలిచి వాళ్లకు డబ్బులు ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాము ప్రజా క్షేత్రంలో నిలిచి గెలిచామన్నారు. ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాను రూ.2 కోట్లు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, రెండు రూపాయలు కూడా ఎవరికి ఇవ్వనని చెప్పారు. మేయర్ ఎన్నిక సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేసినట్లు అర్వింద్ తెలిపారు. తమ అభ్యర్థులు తమకే ఓటు వేస్తారని చెప్పారు. ముందు ప్రతిపక్షంలో ఉంటామని ప్రకటించిన బీజేపీ, ఇప్పుడు మేయర్ రేసులో నిలవడంపై ఆసక్తి నెలకొంది.
నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్‌లు ఉన్నాయి. వీటిలో బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందింది. కార్పొరేషన్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీగా బీజేపీ నిలిచింది. వీటితో పాటు బీజేపీకి మూడు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఓట్లతో కలిపి బీజేపీ సంఖ్యా బలం 31కు చేరింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఈ కార్పొరేషన్‌లో 17 స్థానాలు గెలుచుకుంది. ఎంఐఎం గెలిచిన 14 స్థానాలు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపనున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఓ అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కే జై కొట్టారు. ఇక వీటితో పాటు కాంగ్రెస్‌కు రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్సీగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెలే భూపతి రెడ్డిలు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నారు. వీటన్నంటితో కలిసి కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు చేరుకుంది. ఏ రకంగా చూసినా మేయర్ పీఠం కాంగ్రెస్‌దే అని స్పష్టమవుతోంది. అయితే బీజేపీ పోటీలో నిలవడం వెనుక కారణమేంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. ధర్వపురి అర్వింద్ చివరలో ఏమైనా మ్యాజిక్ చేస్తారా అనేది వేచి చూడాలి.


