కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో ఈ వేసవి సీజన్ లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు (Nizamabad Heatwave) నమోదయ్యాయి. కొన్ని మండలాల్లో 46, 45.7, 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఈసారి అనేక మండలాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు వడ గాలులు వీచాయి. ఈ ప్రభావంతో జనాలు పిట్టల్లా రాలి పోయారు.. ఎల్ ని నో ప్రభావం బాగా ఉందని బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు, డాక్టర్లు చెప్పినా టీవీల్లో వార్తలు చూడలేని వారు దినపత్రికలు ఫాలో కాని వారు చాలా మందికి ప్రభావం తెలియక ప్రతి సారీ లాగే ఆనుకొని బయటకు వెళ్లిన సందర్భాలున్నాయి.. అలాంటి వారు వడ దెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. అందులో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. చిన్న పిల్లలు సైతం కొందరు ఎండ దెబ్బ బారిన పడ్డారు. డీ హైడ్రేషన్ తో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సైతం చాలా మంది ఎండ దెబ్బతో చనిపోయారు.
నిజామాబాద్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు
నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ఆసుపత్రికి వస్తె ప్రత్యేక వార్డులో వారికి చికిత్స అందిస్తారు.. వడ దెబ్బను లైట్ గా తీసుకోవద్దని ఇలాంటి ప్రత్యేక వార్డు సేవలను జనాలు రోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మోహన్ సూచించారు.
పెరిగిన ఐవీ ఫ్లూయిడ్స్ – ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల వినియోగం
నిజామాబాద్ జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో వడ దెబ్బ బాధితులు కూడా భారీగా పెరిగిపోయారు. చిన్న పిల్లలు పెద్దా అనే తేడా లేకుండా… అంతా వడ దెబ్బ బారిన పడుతున్నారు. నగరం పట్టణం గ్రామం అనే తేడా లేకుండా అంతటా భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ముందుగా గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆపై డివిజన్ పరిధిలోని పెద్దాసుపత్రులకు వస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంటే నిజామాబాద్ లోని జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నారు. జిల్లాలో నిజామాబాద్ 750 పడకలు, బోధన్ 300, ఆర్మూర్ 300 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. నిజామాబాద్ ఆసుపత్రిలో రోజుకి వెయ్యి వరకూ ఓపీ సేవల కోసం వస్తున్నారు. అందులో 50 నుంచి వరకూ ఎండ దెబ్బ ప్రభావంతో నీరసం, తల తిరగడం, వాంతులు, విరేచనాలతో ఇన్ పేషంట్లుగా మారుతున్నారు. గత వారం పది రోజుల నుంచి ఎండ ప్రభావంతో ఎక్కువ మంది ఆసుపత్రుల బాట పడుతున్నారు.
ఆర్మూర్ బోధన్ లలో 300 వరకు ఓపీ ఉంటుంది. 30 మంది వరకూ ఇన్ పేషంట్లు చేరితే ప్రస్తుతం ఐపీలో వడదెబ్బ కేసులే అధికంగా నమోదవుతు న్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
వడదెబ్బతో దవాఖానాలో చేరుతున్న వారికి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఈ మేరకు కావాల్సిన ఐవీ ఫ్లూయిడ్ ల వినియోగం నెలవారీగా పెరిగింది. గత రెండు నెలల్లో రోజూ ముగ్గురు చిన్నారులు వడదెబ్బ, జ్వరాలతో దవాఖానాలో చేరేవారు. కానీ మూడు రోజుల నుంచి ఈ సంఖ్య రెట్టింపు అయింది. వీరికి చిల్డ్రన్స్ వార్డులో వైద్యం అందిస్తున్నారు.. నిజామాబాద్ లో దాదాపు 150 నుంచి 200 వరకూ ఐవి ఫ్లూయిడ్ లు కేవలం వడ దెబ్బ బాధితులకు అందిస్తున్నారు. బోధన్ ఆర్మూర్ లలో సైతం 75 నుంచి 80 వరకూ వాడుతున్నారు. ఆర్మూర్, బోధన్ లలో ప్రతిరోజు 75 నుంచి 80 వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను రోగులకు అందిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 500 – 600 ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు వినియోగిస్తున్నారు. ఒక్క ఆసుపత్రిలో నెలకు ఈ సంఖ్య 2 వేల నుంచి మూడు వేల వరకూ ఉంటుంది.
రోహిణి కార్తె – చల్లబడ్డ వాతావరణం
రోహిణి కార్తె ప్రారంభం కావడంతో నిజామాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. సాయంత్రం ఛాలబడటంతో జనాలు ఉపశమనం పొందారు. ఈ మధ్య ఎన్నడూ కనిపించనంత జనం రోడ్లపై కనిపించారు. వివిధ పనుల కోసం జనాలు భారీగా బయటకు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని మెండోరాలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం సాయంత్రం వాతావరణం కాస్త చల్లబడటంతో నవీపేట్, నందిపేట్, జక్రాన్ పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, డిచ్‌పల్లి, వర్ని మండలాల్లో 41-43 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో ఇది 43-45 డిగ్రీలుగా ఉంది. నిజామాబాద్ నగరంతో పాటు పలు పట్టణాల వాసులు ఇళ్లకే పరిమితం అయ్యారు. శుభకార్యాలు, ఇతర అత్యవసర పనులపై దూర ప్రయాణాలు సాగించే వారు భానుడి ప్రతాపంతో అల్లాడుతున్నారు. ఎండకు వెళ్తే మజ్జిగ, నిమ్మరసం, తాగునీరు, ఓఆర్ఎస్ కలిపిన ద్రావణాన్ని తప్పక తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

