కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌తో కలిసి పలు లాడ్జీలు, పాన్ షాపులు, రవాణా కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లాడ్జీలో ఉంటున్న వారి వివరాలు, రికార్డులను పరిశీలించారు. పాన్ షాపుల్లో ఎలాంటి నిషేధిత పదార్థాలు విక్రయించొద్దని హెచ్చరించారు. ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసుల్లో అనుమానాస్పద పార్సిళ్లు, వస్తువులపై డాగ్ స్క్వాడ్ సహాయంతో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు, వ్యక్తులు పట్టుబడలేదని పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో ఎస్సై చేరాలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

