భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్: మంత్రి కోమటిరెడ్డి

కలం, వెబ్ డెస్క్: భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ రవాణాకు కీలకమైన హై స్పీడ్ రైల్వే కారిడార్లపై సోమవారం సెక్రటేరియట్‌లో మంత్రి సమావేశం నిర్వహించారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు వ్యూహాత్మక కారిడార్ల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా, సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ సెంటర్ పాయింట్ అని.. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అత్యంత అనువైన స్థలమని చెప్పారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర రవాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర భవిష్యత్ రవాణాకు కీలకమైన హై స్పీడ్ కారిడార్లు
➥ హైదరాబాద్ – పూణే – ముంబై కారిడార్
➥ భారత్ ఫ్యూచర్ సిటీ – చెన్నై వయా అమరావతి కారిడార్
➥ భారత్ ఫ్యూచర్ సిటీ – బెంగళూరు కారిడార్

హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు హై స్పీడ్ రైలు కనెక్టివిటీ కారిడార్ (High speed rail corridor)పై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వివరించారు. హైదరాబాద్ – పూణే – ముంబై కారిడార్ డీపీఆర్ (DPR) ఇప్పటికే పూర్తి అయిందని.. చెన్నై వయా అమరావతి, బెంగళూరు సర్వే జరుగుతోందన్నారు. మొత్తం 761 కి.మీ గల హైదరాబాద్ – ముంబై కారిడార్ లో మొత్తం స్టేషన్లు 12 అందులో 10 ఎలివేటెడ్,2 అండర్గ్రౌండ్ ఉండనున్నాయి. వికారాబాద్ దగ్గర 4.6 కి.మీ టన్నెల్ నిర్మించే అంశంపై ముఖ్యమంత్రి తో చర్చిస్తానని మంత్రి అధికారులతో అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాన్ స్టాప్ గా 2 గంటల 55 నిమిషాల్లో చేరొచ్చని అధికారులు వివరించారు. 12 స్టేషన్లో ఆగితే గంటకు 330కి. మీ స్పీడ్ తో 3గంటల 21నిమిషాల్లో గమ్యస్థానం చేరుకునేలా ప్లాన్ చేసినట్టు తెలిపారు. 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పటిష్టమైన ఎకనామిక్ గ్రోత్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి ఈ బృహత్తర ప్రాజెక్టులు పూర్తికి కృషి చేయాలన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీ – అమరావతి – చెన్నై కారిడార్ పై మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఏపీ ప్రభుత్వం పూర్తి సముఖంగా ఉందని మంత్రికి అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, పలువురు అధికారులు ఈ ప్రాజెక్టులో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. అటు భారత్ ఫ్యూచర్ సిటీ – బెంగళూరు కారిడార్ లో మన్ననూర్ సోమశిల ప్రాంతాలను కలుపుతూ కారిడార్ డిజైన్ ను PPT ద్వారా మంత్రికి అధికారులు వివరించారు. ఈ కారిడార్లు రాష్ట్ర ఎకనమిక్ గ్రోత్ కారిడార్లుగా మంత్రి అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన కీలక చర్యలపై చర్చిస్తామని వివరించారు.

ఈ సమావేశంలో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికారి ఇందుధర శాస్త్రి, సీపీఎం ముంబై యు.పి సింహా, రజనీష్ సరోజ్, ఆర్&బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య, ఈఎన్సీలు మోహన్ నాయక్, జయభారతి, సీఈ (RSW) వనజతో పాటు పలువురు సీఈలు, రైల్వే అధికారులు, NHSRCL అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>