విజన్ ఇండియా 2047 పై జాతీయ సదస్సు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) ఆధ్వర్యంలో ఆగష్టు  7, 8 తేదీలలో  ‘విజన్ ఇండియా @2047 (Vision India 2047) – ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ పరిపాలన భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగష్టు 7న కన్హా శాంతి వనంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సుమారు 25 మంది ఉపకులపతులు, రిజిస్ట్రార్‌లు , ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధకులు పాల్గొంటారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి అధ్యాపకులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో  తాజా ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు (AI), సుస్థిర అభివృద్ధి, యువత సాధికారత, పరిశ్రమ–విద్యాసంస్థల అనుసంధానం, నవకల్పనల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని చెప్పారు.

ఆగష్టు 8న పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో సాంకేతిక సెషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను ప్రదర్శించడంతో పాటు నిపుణులతో శాస్త్రీయ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని రిజిస్ట్రార్ తెలిపారు. వికసిత భారత్–2047 లక్ష్య సాధనలో ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, యువత భాగస్వామ్యం కీలకమని ఆచార్య పూస రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి సమకాలీన సవాళ్లు, వినూత్న పరిష్కారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని తెలిపారు.

పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు అనుభవాల మార్పిడి, సంయుక్త పరిశోధనలకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పారు. పాలమూరు యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు, నాణ్యమైన ఉన్నత విద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సదస్సు కన్వీనర్లు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ కె. ప్రవీణ, కమిటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ నూర్జహాన్, పీఆర్‌ఓ డాక్టర్ ఎం. గాలెన్న, కోఆర్డినేటర్ డాక్టర్ శేకుంటి రవి కుమార్, అధ్యాపకులు, సదస్సు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>