Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు కలెక్టర్ (Nizamabad Collector)  ఇలా త్రిపాఠి సువర్ణావకాశం కల్పించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) ద్వారా ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో మూడు నెలల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల శిక్షణ కాలానికి గాను రూ. 18,000 రుసుము ఉండగా, జిల్లా యంత్రాంగం తరపున 50 శాతం రాయితీని కల్పిస్తామని అన్నారు. అభ్యర్థులు కేవలం రూ. 9000 రుసుము (నెలకు మూడు వేల చొప్పున) మాత్రమే చెల్లించి, పై ట్రేడ్ లలో శిక్షణ పొందవచ్చని సూచించారు.

అనుభవజ్ఞులతో ట్రైనింగ్

శిక్షణాకాలంలో అనుభవజ్ఞులైన ట్రైనర్లచే అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రాక్టికల్స్‌తో పాటు థియరీలో నాణ్యమైన శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.  శిక్షణ సందర్భంగా ఉచిత యూనిఫామ్, స్టేషనరీ, అధునాతన, సాంకేతికతతో కూడిన యంత్ర పరికరాలతో ప్రాక్టికల్ ట్రైనింగ్, అనుభవజ్ఞులైన ఇన్స్ట్రక్టర్లచే సమర్ధవంతమైన శిక్షణ, న్యాక్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందిచబడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు కలిగిన న్యాక్ సంస్థ ద్వారా ఇదివరకు వివిధ ట్రేడ్లలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పూర్తి స్థాయిలో 100 శాతం ఉపాధి అవకాశాలు కల్పించబడినాయని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి

శిక్షణ తరగతులను న్యాక్ అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ జరుపుతారని, అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందేలా కృషి చేస్తారని అన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హతలు కలిగి ఉండి, 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువకులు ప్రస్తుతం ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో మూడు నెలల శిక్షణ పొందేందుకు అర్హులని సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు 2026 జూన్ 09వ తేదీ లోపు నిజామాబాద్ కలెక్టరేట్ సమీపంలో గల న్యాక్ కేంద్రంలో నేరుగా దరఖాస్తులను అందించవచ్చని అన్నారు. వివరాలకు న్యాక్ కేంద్రం సహాయ సంచాలకులు లింబాద్రి, సెల్ నెంబర్: 9296507557 ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>