వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో యాసంగి–2026 సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) తెలిపారు. మరో వారం రోజుల్లోపు ధాన్యం సేకరణను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాల‌ని ఆమె ఆదేశించారు. ప్రభుత్వం తరఫున ధాన్యం సేకరణ కోసం ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో ఈసారి జిల్లాలో మొత్తం 739 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 6.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని, సుమారు రూ.1,500 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా, రైతుల ఖాతాల్లో రూ.1,320 కోట్ల బిల్లులు జమ అయినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటికే 430 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 40 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, మరో వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు పూర్తి అవుతాయని పేర్కొన్నారు.

పలు ప్రాంతాల్లో వరి కోతలు ఆలస్యంగా జరుగుతున్న కారణంగా ఇప్పుడిప్పుడే దిగుబడులు వస్తుండటంతో, అలాంటి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. కాగా, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల అన్‌లోడింగ్ పాయింట్ల వద్ద రైతులు, హమాలీల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, తాగునీటి సదుపాయం, ఓఆర్ఎస్ సాచెట్లు, మజ్జిగ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కొన్ని రైస్‌మిల్లుల వద్ద మధ్యాహ్న సమయంలో ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ధాన్యం సేకరణ చివరి దశలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తూ, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను వేగవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండటంతో పాటు, ధాన్యం రవాణా కోసం తగినన్ని లారీలను సమకూర్చినట్లు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>