కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నిజామాబాద్ జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతులు జారీ చేస్తున్నామని కలెక్టర్ (Nizamabad Collector) ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల అతిక్రమణను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా సంబంధిత శాఖల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లభించిన తరువాతే పోతంగల్ మండలం హంగర్గా గ్రామ శివారులోని మంజీరా నది నుండి ఇసుక రవాణాకు అనుమతించడం జరిగిందని తెలిపారు.
టీజీఎండీసీ నిబంధనల ప్రకారమే..
టీజీఎండీసీ ద్వారా నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఇసుక రవాణా కొనసాగుతోందని, తన ఆదేశాల మేరకు బోధన్ ఆర్డీవో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఈ మేరకు నివేదిక అందించారని అన్నారు. వే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించామని.. ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకే ఇసుక వాహనాలకు అనుమతిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. టీజీఎండీసీ ద్వారా కొనసాగుతున్న కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామన్నారు.
తూకంలో తేడా రాకుండా చూసుకుంటాం
తూకంలో తేడా లేకుండా, ఓవర్ లోడ్‌కు ఆస్కారం లేకుండా సీసీ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఇసుక లోడ్ తో కూడిన వాహనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తోంది అన్నది ఆన్లైన్‌లో టీజీఎండీసీ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లాలోని మిగతా ఇసుక రీచ్‌ల నుంచి మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా ట్రాక్టర్లలో ఇసుక రవాణాకు అనుమతిస్తున్నామని కలెక్టర్ (Nizamabad Collector) తెలిపారు.
అక్రమరవాణాకు తావు లేదు
ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయము చేసి విస్తృత తనిఖీలు జరిపిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక రవాణా పారదర్శకంగా జరుగుతోందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
Read Also: బండి భగీరథ్ వ్యవహారం.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్
Follow Us On: WhatsApp

