Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ పాలిటిక్స్: డైలాగులు ఫుల్.. డిబేట్లు నిల్‌!

కలం, తెలంగాణ బ్యూరో : ‘ఎక్కడికైనా రెడీ.. డేట్, టైమ్ మీరే ఫిక్స్ చేయండి.. వేదికనూ మీరే డిసైడ్ చేయండి.. తేల్చుకుందాం..’ ఇవీ గత కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో తరచూ వినిపిస్తున్న డైలాగ్స్! అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రతీ పార్టీ తన ప్రత్యర్థులను బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ (Open Debate Challenges) విసరడం ఆనవాయితీగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 60 సార్లు పార్టీలు సవాళ్లు విసురుకున్నాయి. కానీ ఒక్కసారి కూడా బహిరంగ చర్చ జరగలేదు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వైట్ ఛాలెంజ్ మొదలు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులపై, గురుకులాల్లో అవినీతిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు ఒక ట్రెడిషన్‌గానే మారాయి. ప్రెస్ క్లబ్, గన్‌పార్క్, అసెంబ్లీ, పార్టీ ఆఫీసులు.. ఇలాంటివన్నీ ఆ సవాళ్లకు వేదికలయ్యాయి. పార్టీల నేతలు పరస్పరం విమర్శించుకోడానికి, రాజకీయంగా ఒక పార్టీపై మరొకటి పైచేయి సాధించడానికి, మైలేజ్ పెంచుకోడానికి జరుగుతున్న ప్రహసనంగానే ఈ ఛాలెంజెస్ మిగిలిపోతున్నాయి. చర్చ మాత్రం జరగడం లేదు. వాస్తవాలు జనానికి తెలియడం లేదు.

బహిరంగ చర్చల్లో తేలేదేంటి?

రెండు పార్టీల నేతల మధ్య పరస్పరం ఆరోపణలు, సంజాయిషీలు, సవాళ్లు రొటీన్ ప్రాక్టీసుగా మారాయి. బహిరంగ చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేసుకోవడం కూడా పబ్లిసిటీ స్టంట్‌గా తయారైంది. నిజంగా బహిరంగ వేదికలపై చర్చ జరగడం సాధ్యమేనా.. జరిగినా వాస్తవాలు వెలుగులోకి వస్తాయా.. ఎవరి వాదన సరైంది.. ఎవరిది కాదు.. అని డిసైడ్ చేయాల్సింది ఎవరు?.. ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఉండవు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి సవాళ్లు పూటకో రూపంలో తెరపైకి వస్తుంటాయి.

ఇతర దేశాల్లో పరస్పర విరుద్ధ స్వభావం కలిగిన పార్టీల నేతలు టీవీ స్టుడియోల వేదికగా పబ్లిక్ డిబేట్‌లో పాల్గొనడం చాలా సహజం. ఢిల్లీలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ లీడర్ల విద్య, ఆరోగ్య అంశాలపై ఒకే వేదిక మీద డిబేట్ జరిగింది. కర్నాటకలో సైతం ఎలక్షన్ టైమ్‌లో ఒకే డయాస్ మీద బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు చర్చల్లో పాల్గొన్నారు. కానీ, తెలంగాణలో మాత్రం ఒక్క సవాల్ కూడా కార్యరూపం దాల్చలేదు. అసెంబ్లీ వేదికగా జరగాల్సిన, ఎంక్వయిరీ కమిషన్‌లు తేల్చాల్సిన వ్యవహారాలన్నీ ఓపెన్ డిబేట్ అనేది సవాళ్లు, ప్రతిసవాళ్లు అనే డైలాగ్స్కే పరిమితం. అది వర్కవుట్ ఫార్ములాగా తెలంగాణలో ఇప్పటివరకు కనిపించలేదు.

పన్నెండేండ్లుగా ఇదే తంతు

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా డ్రగ్స్, రైతు ఆత్మహత్యలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్, అప్పులు, నిరుద్యోగం, నియామకాలు, అవినీతి, కుటుంబ పాలన, సంక్షేమ పథకాలు, పెట్టుబడులు… ఇలా అనేక అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నాయి. మీడియా సమావేశాలు, సభలు, సోషల్ మీడియా పోస్టులు, ర్యాలీలు, ధర్నాలు, పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేయడం, గంటల్లోనే వారిని విడుదల చేయడం.. ఇలాంటి హడావిడికి మాత్రమే ఆ సవాళ్లు పరిమితమయ్యాయి. రైతు సమస్యలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయపై బహిరంగ చర్చకు రావాలంటూ 2015–16లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

కుటుంబ పాలన, నిరుద్యోగంపై చర్చకు రావాలంటూ 2018 ఎన్నికల సమయంలో టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరాం సవాల్ విసిరారు. అవినీతి, ఉద్యోగాలు, కుటుంబ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఉన్న బండి సంజయ్.. నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి, వరదల నిర్వహణపై 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇదే తరహా సవాళ్లు తెర మీదకు వచ్చాయి. భూ కబ్జాలు, దళితబంధు, రైతు సమస్యలపై చర్చకు సిద్ధమంటూ 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల టైమ్‌లో ఈటల రాజేందర్ ప్రకటించారు. ఉద్యోగాలు, టీఎస్‌పీఎస్సీ, పేపర్ లీక్ అంశాలపై 2022లో నాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చాక ఉధృతం

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ సవాళ్ల ఉధృతి పెంచింది. ఎన్నికల సమయంలోనూ ఒక రకంగా ఈ ధోరణి వేగం పుంజుకున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులు, హామీల అమలు, నిరుద్యోగం, రైతు సమస్యలపై ప్రజల ముందే చర్చకు రావాలంటూ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, విద్యుత్, సంక్షేమం, ఆర్థిక వ్యవహారాలపై చర్చకు సిద్ధమంటూ నాడు కేటీఆర్ కూడా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఈ సవాళ్లు విస్తృతంగా ప్రచారంలోకి వెళ్లాయి. కానీ, ఒక్క అధికారిక చర్చ కూడా జరగలేదు.

రెండున్నరేండ్ల కింద కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సవాళ్లు మరింత ఎక్కువయ్యాయి. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర మంత్రులు 2024, 2025లో పలుమార్లు ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు దీనికి ఘాటుగానే స్పందించి.. కాంగ్రెస్ హామీలు, రుణమాఫీ, ఆర్థిక పరిస్థితి, రైతు సమస్యలపైనా చర్చకు రావాలని ప్రతి సవాళ్లు విసిరారు. బహిరంగ చర్చలు ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన సంప్రదాయమే అయినా తగిన వాతావరణం, నిబంధనలు, తటస్థ వేదిక, నిర్వాహణ లేకుండా పోయింది.

ప్రతిపక్ష నేత రావాలంటూ సీఎం సవాల్

పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారడంతో కాంగ్రెస్‌ను సవాల్ చేయడం ఊపందుకున్నది. రాజకీయంగా మైలేజ్ కోసమేననే విమర్శలూ వచ్చాయి. ఒక దశలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి.. పదేండ్ల బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల పనితీరుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమేనని జూన్ 5న ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ రావాలని ఆయన ఆహ్వానించారు.

ఈ సవాళ్లు, విమర్శలు మరింత తీవ్రం కావడంతో కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన, బీఆర్ఎస్ పదేండ్ల పాలన, కేంద్రంలోని బీజేపీ పన్నెండేండ్ల పాలనపై ఒకే వేదికపై పోల్చి చర్చించేందుకు సిద్ధమని జూన్ 29న సీఎం రేవంత్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా కేటీఆర్ జులై 1న రియాక్టయ్యి.. గత ప్రభుత్వ అప్పులతో పాటు ఈ ప్రభుత్వం అప్పులు, రైతుల సంక్షేమం, గురుకుల విద్యా సంస్థల్లో అవినీతి, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యంపై చర్చించడానికి సిద్ధమేనని, వేదికను నిర్ణయించాలని సవాల్ చేశారు. మరుసటి రోజే కాంగ్రెస్ మంత్రులు గన్‌పార్క్ వద్ద చర్చకు పిలవగా, అది కూడా రాజకీయ ఉద్రిక్తతల మధ్య నిలిచిపోయింది.

మీడియా హైప్ కోసమే..!

పార్టీల నేతల సవాళ్లు రాజకీయ ప్రచారానికే పరిమితమవుతున్నాయి. మీడియా దృష్టిని ఆకర్షించడానికి దోహదపడుతున్నాయి. కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడానికి, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి అనేకసార్లు బహిరంగ చర్చలకు సవాళ్లు విసిరినా, ప్రజలు ప్రత్యక్షంగా చూసిన అధికారిక రాజకీయ డిబేట్ ఒక్కటీ జరగలేదు.

సవాళ్లు విసరడం, ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించడం, వాగ్ధాటిని ప్రదర్శించుకోవడం, సబ్జెక్టులో ఎవరికి ఎంత సత్తా ఉన్నదో తేల్చుకోవడం, ఒకరి అసమర్ధతను మరొకరు ఎత్తి చూపుకోవడం.. ఇలాంటివాటికే ఆ సవాళ్లు పనికొస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా జరగాల్సిన చర్చలు రోడ్డెక్కుతున్నాయి. గతంలో మాదకద్రవ్యాల వినియోగంలో రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌తో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ల ప్రక్రియ వాడివేడిగా మొదలైంది.

రాష్ట్రంలో రాజకీయ సవాళ్లలో కీలకమైనవి కొన్ని ..

సంవత్సరం    సవాల్ విసిరింది  ఎవరికి       ప్రధాన అంశం                         ఫలితం

2015            కాంగ్రెస్               కేసీఆర్         రైతు ఆత్మహత్యలు, సాగునీరు     జరగలేదు
2018            ప్రొ. కోదండరాం     కేసీఆర్         నిరుద్యోగం, కుటుంబ పాలన      జరగలేదు
2019            బండి సంజయ్      కేసీఆర్        అవినీతి, ఉద్యోగాలు                 జరగలేదు
2020            బీజేపీ                  కేటీఆర్        హైదరాబాద్ అభివృద్ధి, వరదలు  జరగలేదు
2021            ఈటల రాజేందర్    బీఆర్ఎస్     దళితబంధు, భూ వివాదాలు       జరగలేదు
2022            వైఎస్ షర్మిల         బీఆర్ఎస్     టీఎస్‌పీఎస్సీ, ఉద్యోగాలు           జరగలేదు
2023            రేవంత్ రెడ్డి           కేసీఆర్        అప్పులు, పాలన                     జరగలేదు
2023           కేటీఆర్                 కాంగ్రెస్        హామీలు                                జరగలేదు
2024           కాంగ్రెస్ మంత్రులు  బీఆర్ఎస్      పదేండ్ల పాలన                       జరగలేదు
2025           కేటీఆర్                 కాంగ్రెస్        రుణమాఫీ, విద్యుత్                  జరగలేదు
2026           రేవంత్ రెడ్డి           కేసీఆర్          పాలన పోలిక                        జరగలేదు
2026           కేటీఆర్                 రేవంత్         అప్పులు, గురుకులాలు            జరగలేదు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>