కలం, కరీంనగర్ బ్యూరో : రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ (BRS vs BJP) శ్రేణుల మధ్య బాహాబాహీ ముష్టి యుద్ధం జరిగింది. ఒకే చోట ఇరువర్గాలు ఒకరికి వ్యతిరేకంగా మరొక ధర్నాకు పూనుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మైనర్ బాలిక అంశంలో బండి భగీరథ్ (Bandi Bhagirath) పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ని మంత్రివర్గం నుంచి పరిష్కరించాలని సోమవారం స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలోని నేతన్న చౌక్ వద్ద బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. దీనికి పోటీగా 22 మంది ఇంటర్ మైనర్ విద్యార్థుల చావుకు కారణమైన కేటీఆర్ ను శిక్షించాలని, గ్లోబరీనా సంస్థపై సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు.
అయితే పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను నేతన్న చౌక్ వద్ద నిరసన తెలుపుకోవాలని, బీజేపీ శ్రేణులను అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన చేపట్టవచ్చని నచ్చ చెప్పారు. దీనితో బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సైతం నేతన్న చౌక్ వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. అయితే ఒకే చోట నిరసనలు కొనసాగడంతో బండి సంజయ్ (Bandi Sanjay) డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ శ్రేణులు పరస్పర నినాదాలు చేసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ (BRS vs BJP) శ్రేణులు ఎదురెదురుగా డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ ఆందోళనలకు దిగడంతో భారీ ఉద్రిక్తతకు దారితీసింది.
ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పరస్పర దాడులకు పూనుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకొని కొట్టుకోవడంతో గందరగోళం ఏర్పడింది. పరిస్థితి విషమించడంతో జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, డీఎస్పీ నాగేంద్ర చారి సహా పోలీసు బలగాలు రంగ ప్రవేశం చేశాయి. పోలీసులు ఇరువర్గాలను నియంత్రించే ప్రయత్నం చేసిన పరిస్థితి అదుపుతప్పి విషమించడంతో లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ స్థితిలో బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని వ్యాన్లలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ గలాటాలో పరస్పర చెప్పుల దాడులు విసురుకోవడంలో జిల్లా ఎస్పీ పక్క నుంచే చెప్పు దూసుకెళ్లింది.
బీఆర్ఎస్ భవన్ వద్ద భారీ నిరసన
నేతన్న చౌక్ వద్ద ఆందోళన ను అదుపుచేసి బీజేపీ, కార్యకర్తలను నాయకులను పోలీసులు అరెస్టు చేసిన అనంతరం అక్కడి నుండి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్ల తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ దాడిని ఖండించారు. అనంతరం తెలంగాణ భవన్ ముందు సిరిసిల్ల – కరీంనగర్ రోడ్డుపై బైఠాయించి బండి భగీరథ్ చిత్రాలతో భారీ ప్లెక్సీని రోడ్డులో నేలపై ప్రదర్శించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర దాడులు నిరసనలతో సిరిసిల్లలో రాజకీయ వేడి అందుకుంది. కాగా ఈ నిరసన కార్యక్రమాలలో నాఫ్స్ క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ నిరసనలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Read Also: మద్యం రేట్ల పెంపుపై ఎక్సయిజ్ శాఖ ఎక్సర్‌సైజ్!
Follow Us On: WhatsApp

