కలం, జోగుళాంబ గద్వాల: జిల్లాలోని (Gadwal) కేటిదొడ్డి మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల డీలర్ షాపులను శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ రాజ్ కుమార్, తహసీల్దార్ కరుణాకర్, మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్ సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ దుకాణాలలో ఉన్న ఎరువులు, విత్తనాల నిల్వలు (స్టాక్), విక్రయ రికార్డులు, లైసెన్సులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డుల ప్రకారం స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ.. డీలర్లు ఎవరైనా రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలను గరిష్ట చిల్లర ధర (MRP) కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి దుకాణంలో స్టాక్ బోర్డులను ప్రదర్శించాలని, రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు కేవలం నాణ్యమైన, ధృవీకరించబడిన వ్యవసాయ ఉత్పాదకాలను మాత్రమే అందుబాటులో ఉంచాలని సూచించారు.
పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలి..
అనంతరం మండల వ్యవసాయ అధికారి రాజవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పంటలలో రసాయనిక ఎరువులను ఇష్టానుసారంగా వాడకుండా, సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలన్నారు. సాంప్రదాయ ఎరువులతో పాటు నానో ఎరువులను (నానో యూరియా, నానో డి.ఎ.పి) ఉపయోగించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి, పంట పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని వివరించారు. రైతులందరూ వ్యవసాయ శాఖాధికారుల సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి లాభసాటి వ్యవసాయం చేయాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

