ధాన్యం కొనుగోళ్లపై సీతక్కకు బీజేపీ నేతల వినతి

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల అన్నదాతలు రోడ్లపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ నాయకులు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ను కలిసి జిల్లాలోని రైతాంగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారని అన్నారు. మిగిలిన 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో, రోడ్ల మీద ఎండకు ఎండుతోందని చెప్పారు. జిల్లాలో 42 – 43 డిగ్రీల ఎండల కారణంగా ధాన్యంలో తేమ తగ్గి, బరువు గణనీయంగా తగ్గుతోందని పేర్కొన్నారు. 40 కిలోలు తూగాల్సిన బస్తా 35 కిలోలే తూగుతుండడంతో రైతులు ఆర్థికంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న వడ్లు నూకలయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,000 కేంద్రాలు తెరిచామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో 2,800 కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఆరోపించారు.

’హమాలీలు ఉంటే తూకం ఉండదు, తూకం ఉంటే ట్యాగింగ్ ఉండదు, ట్యాగింగ్ ఉంటే లారీలు రావు. లారీలు మిల్లులకు వెళ్తే ధాన్యం దించుకోవడం లేదు‘ అని దినేష్ పటేల్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు మిల్లర్లకు ఫోన్ చేసి బతిమిలాడాల్సిన దుస్థితి రావడం ఈ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనడానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. రెండు నెలల ముందే పూర్తి కావాల్సిన కంప్యూటర్ ట్యాగింగ్ పనులు ఇప్పుడు చేస్తుండటం వల్ల ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లతో ఉన్న సమస్యలను పరిష్కరించి, తేమ బరువు తగ్గుదల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అని దినేష్ పటేల్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>