కలం, నిర్మల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో నర్సాపూర్ (జి) మండలం కుస్లీ గ్రామంలో మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడిన ఎస్పీ.. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా లింకులు, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్రామానికి తొలిసారిగా జిల్లా ఎస్పీ రావడంతో కుస్లీ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సైలు గణేష్, శ్రీకాంత్, రవీందర్, లింబాద్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

